ఆరోగ్య శాఖలో గత వైసీపీ సర్కారు ఇన్ని సమస్యలను సృష్టించింది.. అన్నింటినీ బాగు చేస్తున్నాం: మంత్రి సత్యకుమార్
"వైసీపీ పాలనలో వీల్ చేర్లు లేవు, అవినీతి కూరుకుపోయింది, మౌలిక సదుపాయల కల్పన లేదు" అని అన్నారు.

Satyakumar
ఏపీలో ఈ ఏడాది కాలంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో సాధించిన ప్రగతి గురించి ఆయా శాఖల మంత్రి సత్య కుమార్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 10టీవీ నిర్వహించిన మెగా ఈవెంట్ “షైనింగ్ ఏపీ”లో ఆయన పాల్గొని మాట్లాడారు.
“ఆరోగ్య శాఖ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన శాఖ. చాలా ముఖ్యమైన శాఖ. వైసీపీ కోట్లాది రూపాయల బకాయిలు వదిలేసి వెళ్లిపోయింది. ఆరోగ్య శ్రీ, మెడికల్ కాలేజీ, డ్రగ్ సప్లయర్స్, ఎన్‌హెచ్‌ఎంలో బకాయిలు పెట్టింది. వారి వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి.
వీల్ చేర్లు లేవు, అవినీతి కూరుకుపోయింది, డాక్టర్లు సమయానికి రావట్లేదు, మౌలిక సదుపాయల కల్పన లేదు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ లేదు.. ఇన్ని పరిస్థితులను సరిచేసుకుంటూ, బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తున్నాం. మౌలిక సదుపాయాల మీద నిధులు ఖర్చు చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులని గట్టెక్కిస్తున్నాం
ఈ కూటమికి పట్టంకట్టి, మా నాయకత్వం పట్ల విశ్వాసంతో, నమ్మకంతో ఐదేళ్లు ఓ మంచి పాలన అందిస్తారని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి పరిస్థితులు ఉండేవో రాష్ట్ర ప్రజలు చూశారు.
దీంతో మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు అనుగుణంగానే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీ ప్రభుత్వం ఉంది. వైసీపీ పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు ఈ ఒక సంవత్సరంలోనే మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఈ సంవత్సర పాలన సంతృప్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను.
దానికి తోడు కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర సహకారాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుట పడి పరుగులు తీయాలంటే మరి కాస్త సమయం పడుతుందని చంద్రబాబు చెబుతుంటారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి ఈ అభివృద్ధి రాబోయే రోజులో పరుగులు తీస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో నడుస్తుందనే విశ్వాసం నాకు ఉంది. ఇప్పుడు పలు కంపెనీలు ఏపీలో పెద్ద ఎత్తన పెట్టుబడులు పెడుతున్నాయి. సురక్షితమైన మంచి నీరు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఎందుకంటే అనేక రకాలైన సీకేడీ కేసులు వస్తున్నాయి. పలు రకాల పనులకు నిర్దేశించిన ఈ నిధులని కూడా గత వైసీపీ పాలనలో దారి మళ్లించారు. ఇప్పుడు ఏ లక్ష్యం కోసం నిధులు వస్తున్నాయో ఆ లక్ష్యం కోసమే ఖర్చు అవుతున్నాయి” అని తెలిపారు.