రాబోయే 5 రోజులు జాగ్రత్త.. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మార్చిలోనే మే నెల ఎండలను గుర్తు చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాబోయే 5 రోజులు జాగ్రత్త.. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Hot Summer : భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగబోతోందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లోనూ ఎండల ప్రభావం ఎక్కువగా ఉందని.. ఉద్యోగాలు, ఇతర పనుల కోసం బయటకు వచ్చే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రెండు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పెరిగాయి. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత తట్టుకోవడం కష్టంగా మారింది.

విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మార్చిలోనే మే నెల ఎండలను గుర్తు చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదవుతుంది అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ఇక ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుందని వెల్లడించింది. కాస్త చల్లటి వాతావరణం ఉండే హైదరాబాద్ లోనూ ఎండలు దంచికొడుతున్నాయి.

దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ లో ఉక్కపోత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఎండ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరీ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని, ఉదయం సాయంత్రం వేళల్లో పనులు చక్కబెట్టుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరై మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లాల్సి వస్తే మంచి నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి వాటిని దగ్గర ఉంచుకోవాలని.. తరుచూ నీరు తాగాలని సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి పూటతో పాటు రాత్రి టెంపరేచర్లు సాధారణం కంటే ఎక్కువ నమోదవుతున్నాయి.

Also Read : బెంగళూరులో నీటి సంక్షోభం.. నీళ్లను వృథా చేసిన 22 కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా!