Temple For Son: రూ.50 లక్షలతో కుమారుడికి గుడి కట్టించిన తల్లి.. విగ్రహానికి నిత్య పూజలు.. సేవా కార్యక్రమాలు కూడా..
ఈ ట్రస్ట్ పేరుతో ఇప్పటివరకు రూ.50 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ప్రతి నెల 5, 19 తేదీల్లో అన్న సమారాధన సైతం నిర్వహిస్తున్నారు.
Temple For Son: ఈ లోకంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమే. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది అమ్మ. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి మనసు విలవిలలాడిపోతుంది. తన ప్రాణం ఉన్నంతవరకు పిల్లల బాగు కోరుకుంటుంది. తల్లి ప్రేమ అంత గొప్పది. తాజాగా ఓ అమ్మ చేసిన పని.. తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చిన్న వయసులోనే తనకు దూరమైన కొడుకుని మర్చిపోలేకపోయిన ఆ తల్లి.. కొడుక్కి గుడి కట్టించింది. అందులో అతడి విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తోంది. అంతేకాదు అతడి పేరుతో సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. పదమూడున్నరేళ్ల వయసులో అనారోగ్యంతో కొడుకు దూరమవగా.. ఆ వేదన నుంచి కోలుకోలేకపోయిన తల్లిదండ్రులు.. బిడ్డపై తమ ప్రేమనంతా ఓ గుడిలా మార్చారు.
రాజమహేంద్రవరానికి చెందిన వేణుగోపాల్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు సాయి తేజస్విని. కొడుకు పేరు వేదసాయిదత్త. అనారోగ్యంతో కొడుకు సాయిదత్త 2016లో చనిపోయాడు. కొడుకు మరణాన్ని తల్లి శ్రీదేవి తట్టుకోలేకపోయింది. అతడి జ్ఞాపకార్థం గుడి కట్టించింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు సమీపంలో తమ పొలంలో కుమారుడిని సమాధి చేసిన చోటే మందిరం కట్టించింది.
ఇందుకోసం రూ.45 లక్షలు ఖర్చు చేశారు. టైల్స్, మార్బుల్స్, విలువైన వస్తు సామగ్రితో సుందరంగా తీర్చిదిద్దారు. కుమారుడి స్మృతిలో ఓంకారేశ్వర్ పేరుతో ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ పేరుతో ఇప్పటివరకు రూ.50 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ప్రతి నెల 5, 19 తేదీల్లో అన్న సమారాధన సైతం నిర్వహిస్తున్నారు.
తనకు గుడి కట్టించాలని తమ కుమారుడు చెప్పినట్లు అనిపించిందని, అందుకే సమాధిపైనే బాబు పాలరాతి విగ్రహం ఏర్పాటు చేసి ఆలయం కట్టించి వేదసాయి దత్త మందిరం అని పేరు పెట్టామని తల్లి శ్రీదేవి తెలిపారు. తన కుమారుడి జ్ఞాపకాలను స్మరించుకునేందుకు ఇలా గుడి కట్టించామన్నారు.
డిసెంబర్ 5న సాయిదత్త జన్మదినం. డిసెంబర్ 19న అనారోగ్యంతో కన్నుమూశాడు. దాంతో ప్రతి నెల 15, 19 తేదీల్లో అన్నసమారాధన సైతం నిర్వహిస్తున్నారు. స్వయంగా తన చేతులతో ఆహారాన్ని వడ్డిస్తారు శ్రీదేవి. గుడి కట్టించిన ప్రదేశంలో ఉంటే తన బిడ్డతోనే ఉన్నట్లు ఉంటుందనే ఆమె చెబుతారు.
Also Read: మీ ఓటును ఇంకెవరో వేస్తే టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి..
