Nambala Keshava Rao: మృతదేహం కోసం న్యాయపోరాటం.. హైకోర్టును ఆశ్రయించిన నంబాల కేశవరావు కుటుంబం..

కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు.

Nambala Keshava Rao: మృతదేహం కోసం న్యాయపోరాటం.. హైకోర్టును ఆశ్రయించిన నంబాల కేశవరావు కుటుంబం..

Updated On : May 23, 2025 / 6:07 PM IST

Nambala Keshava Rao: భద్రతా బలగాల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, కేశవరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు ఛత్తీస్ గఢ్ పోలీసులు నిరాకరించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. కేవశరావు కుటుంబసభ్యులను ఏవోబీలో దించేసి పోలీసులు వెళ్లిపోయారు. మృతదేహాన్ని అప్పగిస్తే స్మారక స్థూపాలు, ర్యాలీలు నిర్వహిస్తారని.. అందుకే ఇచ్చేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు.

మృతదేహాన్ని తమకు ఇవ్వాలని నంబాల కేశవరావు సోదరుడు నంబాల రాంప్రసాద్, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు పోలీసులు నిరాకరించడంతో వారు హైకోర్టుని ఆశ్రయించారు. మృతదేహాన్ని ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తామని నంబాల రాంప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం ఎస్పీ తనను బెదిరించారని కేశవరావు సోదరుడు ఆరోపించారు.

Also Read: సలాం రాజ్ భాయ్‌.. పానీపూరి అమ్ముతూ… రాత్రి చదువుకుంటూ… ఇస్రోలో చేరాలన్న కలను నెరవేర్చుకుని… వారెవ్వా

మరోవైపు కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు. కాగా, జగదల్పూర్‌లో పోలీసులపై దాడి ఘటనలో నంబాల కేశవరావు కీలకపాత్ర పోషించారని పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఉన్నాడు. నక్సల్ ఉద్యమానికి వెన్నుముకగా వ్యవహరించాడు నంబాల కేశవ రావు. నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. 1970 నుండి మావోయిస్టు ఉద్యమంలో అనుభవజ్ఞుడైన బసవరాజు దేశంలోని అత్యంత కీలక మావోయిస్టు నాయకుల్లో ఒకడు. అతని తలపై 1.5 కోట్ల రూపాయల రివార్డ్ ఉంది.

ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దీన్ని.. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయంగా ఆయన అభివర్ణించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు ప్రధాని మోదీ. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా అన్నారు. మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.