Nara Lokesh: ఇందులో నాకు కూడా మినహాయింపు లేదు: నారా లోకేశ్

"మహానాడు వేదికగా రేపు యువతకి శుభవార్త చెబుతాం" అని లోకేశ్ చెప్పారు.

 Nara Lokesh: ఇందులో నాకు కూడా మినహాయింపు లేదు: నారా లోకేశ్

Nara Lokesh

Updated On : May 27, 2023 / 6:58 PM IST

Nara Lokesh-TDP: మహానాడు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అమరావతిలో మీడియాతో నారా లోకేశ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) నాయకత్వంలో ఎవరు పనిచేయకపోతే వాళ్లకి గుర్తింపు ఉండబోదని స్పష్టం చేశారు.

“ఇందులో నాకు కూడా మినహాయింపు లేదు. పనిచేయని వారికి టిక్కెట్లు రావు. పార్టీ తరఫున స్వచ్ఛంద సేవ చేస్తామంటే ఎవరినైనా ప్రోత్సహిస్తాం. నేను చేయను, ఇతరులూ చేయకూడదు అనే తత్వం సరికాదు. పని చేసేవారిని ఇన్‌చార్జిలుగా ప్రోత్సహిస్తే సమష్టి కృషి అక్కడ ప్రతిబింబిస్తుంది.

సేవా కార్యక్రమాలు చేసే వారు ఇన్‌చార్జిలకి సమాచారం ఇచ్చి వారి ఫొటో కూడా పెట్టి చేస్తే ఇబ్బంది లేదు. కానీ ఇన్‌చార్జిలు చెప్పినట్టే అన్నీ జరగాలంటే ఎలా? టిక్కెట్లు అనేవి నాయకుల సామర్థ్యం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది. ఇందులో లోకేశ్ అయినా మరెవరైనా ఒక్కటే.

సంక్షేమం అందుకుంటున్న నిరుపేదల కుటుంబాలు, తమ బిడ్డలకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభించాలంటే తెలుగుదేశం రావాలనే కోరుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చితే వైకాపా చేసిన సంక్షేమం తక్కువ కాబట్టే దాని గురించి మాట్లాడట్లేదు. టీడీపీలో సముచిత స్థానం, గౌరవం పొంది స్వార్థంతో పార్టీ వీడిన కొందరు ఇప్పుడు వస్తామన్నా మాకు అవసరం లేదు.

వారి స్థానంలో కొత్త తరం నాయకుల్ని తయారుచేసుకుంటాం. ఆర్ 5 జోన్ లో 24 నెలల్లో ఇళ్లు కట్టాలని ఒత్తిడి తేవడం కోర్టు తీర్పునకు విరుద్ధం కాదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడుoటున్న వారు వేరొక చోటికి వెళ్లి, నివాసం ఏర్పర్చుకుని ఉపాధి కోసం తిరగాలంటే రోజుకు రూ.500 వరకూ ప్రతీ పేదకి ఖర్చవుతుంది.

ఇప్పుడు ఉంటున్న ఇళ్లు జగన్మోహన్ రెడ్డి కూల్చబోతున్నాడనే విషయం పేదలకు అర్థమైపోతోంది. కొండ, పోరంబోకు, అటవీ భూముల క్రమబద్ధీకరణ చేస్తానని మంగళగిరిలో పేదలకు హామీ ఇచ్చా. నా భుజానికి స్కాన్ చేశారు.. నా భుజం నొప్పికి గాయమే కారణమని వైద్యులు గుర్తించారు.

తగ్గాలంటే కనీసం నెలరోజులైనా ఒత్తిడి పెట్టొదని వైద్యులు సూచించారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఆ ప్రాంత అభివృద్ధి కి రూట్ మ్యాప్ ప్రకటిస్తా. తాగు, సాగునీటి వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై రూట్ మ్యాప్ ఉంటుంది. మహానాడు వేదికగా రేపు యువతకి శుభవార్త చెబుతాం” అని లోకేశ్ చెప్పారు.

TDP Mahanadu 2023 : తెలుగుదేశం జెండా తెలుగు జాతికి అండ .. జెండాలో నాగలిని ఎన్టీఆర్ అందుకే పెట్టారు : చంద్రబాబు