Sarada Peetham: విశాఖలోని శారదాపీఠంకు మరో బిగ్ షాకిచ్చిన కూటమి ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం హయాంలో శారదాపీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని

Sri Sarada Peetham
Visakha Sri Sarada Peetham : విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామికి కూటమి సర్కార్ బిగ్ షాకిచ్చింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో శారదాపీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖలో రూ.225 కోట్ల విలువచేసే 15ఎకరాలను రూ.15 లక్షలకు నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం శారదా పీఠానికి కట్టబెట్టింది. అయితే, ఆ సమయంలో ధర నిర్ణయించాలని అప్పటి ప్రభుత్వం అప్పటి కలెక్టర్ ను కోరగా.. రిజిస్ట్రేషన్ విలువ పరిగణలోకి తీసుకుని ఎకరాకు 1.8 కోట్ల రూపాయలకు ఇవ్వొచ్చని సిఫార్సు చేశారు. దాని ప్రకారం ప్రభుత్వానికి శారదాపీఠం సుమారు 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, జగన్ సర్కార్ ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చేసింది. అంటే, 15 ఎకరాలను రూ.15 లక్షలకే ఇచ్చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. వైసీపీ ప్రభుత్వం హయాంలో చాలాచౌకగా శారదా పీఠానికి కేటాయించిన భూములపై విచారణ జరిపింది. ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని తేల్చింది.
ఎన్డీయే ప్రభుత్వం గత మంత్రివర్గ సమావేశంలో ఈ భూముల కేటాయింపులను రద్దు చేయాలని తీర్మానించింది. తాజాగా రెవెన్యూ శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు అనుసరించి అధికారులు తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇదిలాఉంటే.. తిరుమలలో శారద పీఠం చేపట్టిన భవనాల నిర్మాణాలకు ఇటీవల టీటీడీ అనుమతులు రద్దు చేసిన విషయం తెలిసిందే.