NIA searches : విరసం, పౌరహక్కుల సంఘం నేతల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు
ఏపీ, తెలంగాణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు.

Nia
NIA searches ap and telangana : ఏపీ, తెలంగాణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు. విశాఖలోని పిఠాపురంలో అడ్వకేట్ పద్మ, చిన్నవాల్తేరులో అడ్వకేట్ కే.ఎస్. చలం, రాజమండ్రిలో APCLC రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చిలుకా చంద్రశేఖర్, కర్నూలులో విప్లవ కవి పినాక పాణి, ప్రజా కళా మండలి కోటి, అమరుల బంధుమిత్రుల సంఘం అంజమ్మ ఇంట్లో తనిఖీలు చేశారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం మాజీ మాజీ కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. గత ఏడాది నవంబరులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై వరలక్ష్మితో పాటు మరో 27 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రభుత్వం గతంలోనే ఈ కేసులను NIAకు అప్పగించింది.
హైదరాబాద్‌లో ఏడుగురు నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్‌సుఖ్‌నగర్‌లో అడ్వకేట్ రఘునాథ్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. ఆయన ల్యాప్ టాప్‌తో పాటు కంప్యూటర్‌ను పరిశీలించారు. ఆ తర్వాత రఘునాథ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు ప్రజాకళామండలి సభ్యులు డప్పు రమేష్, జాను, చైతన్య మహిళా సంఘం నాయకురాళ్లు శిల్ప, దేవేంద్ర, స్వప్న, దేవేందర్ ఇళ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీమా కోరెగావ్ కేసుతో పాటు విశాఖ ముంచింగిపుట్టు కేసులోనూ NIA సోదాలు చేస్తోంది. ముంచింగిపుట్టు కేసులో గతంలో 36 మందిపై కేసులు నమోదైంది. తాజాగా అధికారులు మరో 8 మందిపైనా కేసులు పెట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలపాల యాక్ట్‌తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మావోయిస్టు అగ్రనేతలను తరచూ కలిసి వస్తున్నారని అభియోగాలు నమోదయ్యాయి.
గత ఏడాది నవంబరు 23న నాగన్న అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. పోలీసుల కదలికలను అతడు మావోయిస్టులకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. ముంచింగిపుట్టు పోలీసులు ఆ వివరాలను కేంద్రహోంశాఖకు పంపారు. దీంతో రంగంలోకి దిగిన NIA.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచరణ చేపట్టింది. కేసు దర్యాప్తులో భాగంగానే ఆయా సంఘాల నేతల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఎన్‌ఐఏ సోదాలపై విరసం, పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. సోదాల పేరుతో తమను వేధిస్తున్నారని.. పౌర హక్కుల నేతలను భయపెట్టేందుకే సోదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.