ఎన్నో ట్విస్టులు..నిమ్మగడ్డ రీ ఎంట్రీ..బాధ్యతల స్వీకరణ

ఎన్నో పరిణామలు, ట్విస్టుల మీద ట్విస్టులు..సుమారు మూడు నెలల న్యాయపోరాటం ద్వారా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. 2020, జులై 03వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని SEC కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇదే పదవిని చేపట్టడం రెండోసారి అవుతుంది. ఐదేళ్ల పదవీ కాలంలో ఇంకా 8 నెలలు మిగిలి ఉన్నాయని తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం 2020, జులై 31వ తేదీ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట ప్రకటన విడుదల చేశారు.
నిమ్మగడ్డ పదవీకాలం కుదింపు, కొత్త కమిషనర్ గ జస్టిస్ కనకరాజును ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీనిని హైకోర్టు కొట్టివేసింది. తిరిగి రమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ..ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే..హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరినా..సుప్రీం తిరస్కరించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగాయి. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నామని మార్చి 15న ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. సీఎం జగన్ రమేష్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.