కరోనా భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు..చెత్తను తరలించే ఆటోలోనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లారు

కరోనా కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మానవునిపై కనికరం చూపడం లేదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా దగ్గరికి రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చివరకు కరోనా బాధితులు అనాథలయ్యారు.
108 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆఖరికి ప్రైవేట్ ఆంబులెన్సులు రాలేదు. దీంతో చేసేదేమీ లేక చెత్తను తరలించే ఆటోలోనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలో జరిగింది. బస్టాప్ లో ఓ వ్యక్తి రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
అతనికి అయినవారు ఎవరూ లేరు. అయితే కరోనా భయంతో ఎవరూ వెళ్లలేదు. చివరికి అతని ధీనస్థితిని చూడలేక కొందరు 108కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో చెత్త ఆటోలోనే ఆకివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని ఏలూరుకు తరలించారు.