Balineni Vs Damacharla : బాలినేని వర్సెస్ దామచర్ల డైలాగ్‌వార్.. రంగంలోకి కూటమి నేతలు.. నెక్ట్స్ జరగబోయేది అదేనా?
Balineni Vs Damacharla : దామచర్ల, బాలినేని ఎపిసోడ్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ..ఈ వ్యవహారంపై కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే, ఇద్దరు నేతలకు కీలక హెచ్చరికలు జారీ చేసినట్లు
Balineni Srinivasa Reddy vs Damacharla Janardhan,
Balineni Vs Damacharla : ఆరని మంటగా ఆ ఇద్దరు మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య టగ్ ఆఫ్ కంటిన్యూ అవుతోంది. బాలినేని వైసీపీలో ఉన్నప్పటి నుంచే ఆయనంటే దామచర్లకు గిట్టదు. ఆ తర్వాత బాలినేని జనసేనలో చేరినప్పటి నుంచి ఒంగోలు రాజకీయం రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇద్దరు కూటమి పార్టీలైన జనసేన, టీడీపీలోనే ఉండగా..ఒకరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే.. మరొకరు జనసేన లీడర్‌గా కొనసాగుతున్నారు.
పాత వైరం మరోసారి తెరపైకి రావడంతో.. కొత్త టర్న్ తీసుకుంటూ..సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రంజుగా మారుతోంది. దామచర్ల అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారన్న బాలినేని ఆరోపిస్తే..వైసీపీ హయాంలో బాలినేని చేసిన కరప్షన్ గురించి చెప్పాలంటే పుస్తకాలు కూడా సరిపోవన్నారు దామచర్ల. లేటెస్ట్గా ఎమ్మెల్యే దామచర్లకు బాలినేని మరోసారి కౌంటరిచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీపడాలని సవాల్ చేశారు. ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దామని..తాను 30 వేల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
జనసేన లేకపోతే దామచర్ల అసలు ఎమ్మెల్యే అయ్యేవారా అంటూ బాలినేని క్వశ్చన్ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా జనసేన అధికార పార్టీగా ఉన్నా తమకు అధికారాలు లేవు..అలాంటి వాతావరణం లేదంటూ బాలినేని చేసిన కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. కేవలం అధికార పార్టీలో ఉన్నామంటే ఉన్నా. ఎలాంటి పవర్స్ లేవంటూ బాలినేని చెప్పుకురావడం జనసేనలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఏడాదిన్నర కింద పార్టీలోకి వచ్చిన బాలినేని జనసేన పవర్స్ గురించి..అధికారం గురించి మాట్లాడటం ఏంటో అర్థం కావట్లేదన్న గుసగుసలు మొదలయ్యాయి.
బాలినేని జనసేనలో చేరి ఉండకపోతే లోపల వేయించేవాడినని ఎమ్మెల్యే జనార్దన్ అంటే..అంతకు మించి అన్నట్లుగా బాలినేని కౌంటర్ అటాక్ చేశారు. తాను అవినీతి చేశాను అనుకుంటే సీఎం చంద్రబాబుకు చెప్పి విచారణ జరిపించాలని దామచర్లకు సవాల్ చేశారు బాలినేని. తాను కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పి దామచర్లపై విచారణ చేయిస్తానన్నారు. తన అనుచరులపై కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించిన బాలినేని..ఒంగోలు కార్పొరేషన్లో మిస్సైన రూ.8.5 కోట్లు ఏమయ్యాయో దామచర్ల చెప్పాలన్నారు. బాలినేని హైదరాబాద్‌లో కూర్చుంటున్నారని దామచర్ల విమర్శిస్తే..ఒంగోలులో జరిగే అవినీతి చూడలేక హైదరాబాద్‌కు వెళ్లి కూర్చుంటున్నానని రివర్స్ అటాక్ చేశారు బాలినేని. సెటిల్మెంట్లు, ఇసుక, మద్యం, రేషన్ డీలర్ల నుంచి నెల నెలా మామూళ్లు రావడం లేదా.? అంటూ సెటైర్లు పేల్చారు.
ఏకంగా ఎమ్మెల్యే జనార్దన్‌పై చేసిన ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి తాను సిద్ధమన్నారు బాలినేని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్ ఒంగోలుకు చేసింది ఏమీ లేదన్నారు. దీంతో ఒంగోలు కూటమిలో మాటల యుద్ధం మరోసారి పొలిటికల్ హీట్‌ను పెంచేసింది. మరోవైపు బాలినేని, దామచర్ల జనార్ధన్ పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకోవటంతో ఈ వ్యవహారం టీడీపీ, జనసేన పార్టీలలో హాట్ టాపిక్ అయ్యింది.
బాలినేని, దామచర్ల ఎపిసోడ్ రోజురోజుకు ఎక్కువైపోతుండటంతో టీడీపీ, జనసేన అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఇద్దరు నేతలు వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉండటంపై సీరియస్ అయ్యారు. అటు బాలినేని, ఇటు దామచర్ల ఇద్దరు సంయమనం పాటించాలని..ఏవైనా ఇష్యూస్ ఉంటే తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సమన్వయ కమిటీ సూచించింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని ఇద్దరికి ఆదేశాలు వెళ్లాయట.
దామచర్ల, బాలినేని ఎపిసోడ్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ..ఈ వ్యవహారంపై కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు..ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఫోన్ చేసి మాట్లాడారట. అటు జనసేన అగ్రనేతలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంయమనం పాటించాలని సూచించారట. ఇప్పటికైతే ఇద్దరు నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు, ఆరోపణలు చేసుకోకుండా కూటమి నేతలు బ్రేకులు వేయగలిగారు. కానీ రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే ఒంగోలు రాజకీయం సాఫీగా జరుగుతుందని..లేకపోతే నిత్యం రాజకీయ కుంపటి రగలడం ఖాయంటున్నారు కూటమి కార్యకర్తలు. ఈ ఇష్యూకు రెండు పార్టీల అధిష్టానం పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడుతారో చూడాలి మరి.
