ప్రేమించిన వాడితో పెళ్లి చేయట్లేదని మైనర్ బాలిక ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : September 11, 2020 / 02:03 PM IST
ప్రేమించిన వాడితో పెళ్లి చేయట్లేదని  మైనర్ బాలిక ఆత్మహత్య

Updated On : September 11, 2020 / 3:16 PM IST

తెలిసీ తెలియని వయస్సులో పుట్టే ప్రేమలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్ళకు గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ…వ్యామోహం….ఆకర్షణ… వీటి మధ్య కల వ్యత్యాసాన్ని గుర్తించలేని యువత  తీసుకునే  తొందరపాటు చర్యతో జీవితాన్ని ముగిస్తున్నారు. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండకుండానే ప్రేమించిన వాడికిచ్చి పెళ్లిచేయలేదని ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుని తల్లి,తండ్రులకు శోకాన్నిమిగిల్చింది.

నెల్లూరు రూరల్ కు చెందిన ఒక మైనర్ బాలిక స్ధానికంగా ఉన్నయువకుడితో చనువుగా ఉంటోంది. 9వ తరగతి చదువుతున్న తమ కుమార్తె ప్రవర్తన, యువకుడితో స్నేహంగా ఉండటం బాలిక తల్లితండ్రులు గమనించారు. బాలికకు నచ్చచెప్పి.. బాగా చదువుకోవాలని చెప్పి…ఆ బాలికను వేరే ఊరులో ఉన్న వారి బంధువుల ఇంటి వద్దకు పంపించి చదివించ సాగారు.



కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలవటంతో బంధువుల ఇంటి నుంచి బాలిక స్వగ్రామానికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో తల్లి,తండ్రులు బాలికను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిశ్చితార్ధం కూడా జరిగింది.

మంగళవారం సెప్టెంబర్ 8వ తేదీన, స్నానానికి వెళుతున్నానని చెప్పి బాత్రూం లోకి వెళ్ళిన బాలిక బాత్రూం రేకులకు అమర్చిన ఇనుప రాడ్డుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూం లోంచి ఎప్పటికీ కుమార్తె బయటకు రాకపోవటంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూడగా, బాలిక బాత్రూంలో ఉరివేసుకుని కనిపించింది.



108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించబోగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రకి తరలించారు. ప్రియుడితో ఇచ్చివివాహాం చేయలేదనే కారణంతోనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.