కన్నపేగే కడతేర్చింది.. మూడనమ్మకాలతో యువతులను డంబెల్‌తో..

chittoor: కడుపులో దాచుకోవాల్సిన తల్లే కడతేర్చింది. ఉన్నత చదువులు చెప్పే తండ్రే ఊపిరి తీశాడు. సమాజంలో ఉన్నత పదవుల్లో ఉండి.. ఆదర్శంగా నిలవాల్సిన వారు కన్నబిడ్డలనే తిరిగిరాని లోకాలకు పంపేశారు. ఆధ్యాత్మిక స్థాయి దాటి పైశాచికత్వంలోకి వెళ్లిపోయారు. అపోహలకు పోయి జాతీయ బాలికల దినోత్సవం రోజే కన్నకూతుళ్లని.. ఇంటి మహలక్ష్ములని చంపేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఈ దారుణం.. కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లపై ప్రయోగం చేశారు ఆ పేరెంట్స్. ఇద్దరు కుమార్తెలను డంబెల్‌తో మోది దారుణహత్య చేశారు. పూజల పేరుతో తల్లిదండ్రుల చేసిన దారుణమే ఈ హత్యకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మదనపల్లె స్థానిక శివనగర్‌లో పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులే ఈ ఘటనకు పాల్పడ్డారు.
మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న పురుషోత్తమనాయుడు, అతని భార్య పద్మజ ఓ ప్రైవేట్ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య, సాయిదివ్య కుమార్తెలున్నారు. ఏవో అద్భుతాలు జరుగుతాయని కొంత కాలంగా పూజలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట సాయి దివ్యను, తర్వాత అలేఖ్యను వ్యాయామం చేసుకునే డంబెల్‌తో కొట్టి హత్యచేశారు.
చనిపోయిన ఇద్దరి కుమార్తెలు కూడా దైవభక్తితో పూజలు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించాం. పూజల్లో భాగంగానే ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులే హత్యచేసినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు డీఎస్పీ రవి మనోహరాచారి.
పై అంతస్తులో ఒకరిని, కింది అంతస్తులో మరొకరిని చంపేశారు. శబ్దాలు విని స్థానికులు విషయం తెలియజేయడంతో పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరికి కూడా చీరకట్టి నోట్లో రాగిచెంబు పెట్టి ఉందన్నారు. చీర కట్టి, రాగిచెంబు పెట్టాక.. తలపై డంబెల్‌తో కొట్టి చంపినట్టుగా గుర్తించామన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలకు పోలీసులు షాక్ అయ్యారు.
‘ఒక్క రోజు రాత్రి ఆగండి.. పిల్లలు తిరిగి బతికి వస్తారు’ అని చెబుతున్నారు. చనిపోయిన యువతులు బాగానే చదువుకున్నారు. భోపాల్ లో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఒకరు, బీబీఏ చదివి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటుందని తెలిసింది.