నివార్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పర్యటన.. నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్‌

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 08:25 AM IST
నివార్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పర్యటన.. నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్‌

Updated On : December 5, 2020 / 9:04 AM IST

pawan kalyan visit nivar harricane hit areas : నివార్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చేపట్టిన పవన్‌ యాత్ర చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొనసాగింది.. తొట్టంబేడు మండలం పొయ్యి గ్రామంలో పవన్‌ పర్యటించారు.. రైతులతో ముఖాముఖి అయ్యారు.. అయితే ఈ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన పర్యటనను వైఎసీపీ నేతలు అడ్డుకోవడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులపై చెయ్యి వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ అరాచకాలకు అడ్డు లేకుండా పోతోందని మండిపడ్డారు.



అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టే వారికి అండగా ఉండాలని బయటకొచ్చానన్నారు పవన్‌ కల్యాణ్‌. అయితే తన పర్యటనను వైసీపీ నాయకులు అడుగడుగునా అడ్డుకోవడం సరికాదని, ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ నాయకుల జాగీరా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థతో జనసేన నాయకులను అడ్డుకోవాలని చూస్తే గోడలు బద్దలు కొట్టుకొని దూసుకు వస్తామని పవన్ హెచ్చరించారు.



అనంతరం పవన్ పర్యటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొనసాగింది. తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు ఎకరాకు 35 వేలు ఇవ్వాలని పవన్ మరోసారి డిమాండ్ చేశారు. 150 ఎమ్యెల్యేలు ఉన్న వైసీపీ.. ఒక్క ఎమ్యెల్యే ఉన్న తనపై ఎందుకు కక్షసాధిస్తోందని ప్రశ్నించారు. ఉన్న ఒక్క ఎమ్యెల్యే వైసీపీకి వత్తాసు పలుకుతుంటే భయపడే తత్త్వం తనది కాదన్నారు.

జనసేన పార్టీ ఏఒక్క కులానికో, కుటుంబానికో సంబంధించిన రాజకీయ వ్యవస్థ కాదన్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సుపరిపాలనను అందిస్తామన్నారు. జోరు వర్షం కురుస్తున్నా పవన్‌ తన పర్యటన కొనసాగించారు.



ఇవాళ పెన్నానది వరద ప్రవాహాంలో ముంపుకు గురైన వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ వాసులతో పవన్ కల్యాణ్ మాట్లాడతారు. తర్వాత ఇనమడుగుకు గ్రామానికి చేరుకుని అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడకు వెళ్తారు.