చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు

  • Published By: vamsi ,Published On : November 13, 2019 / 10:50 AM IST
చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు

Updated On : November 13, 2019 / 10:50 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇసుక కొరతపై రేపు(14 నవంబర్ 2019) చేపట్టనున్న దీక్షకు మద్దతు కోరుతూ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ చేపట్టిన విశాఖ లాంగ్ మార్చ్‌కు టీడీపీ మద్దతు ప్రకటించగా.. అప్పుడు టీడీపీ నేతలు హాజరయ్యారు. అచ్చెన్నాయుడు కూడా సభకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షకు మద్దతు కోరారు తెలుగు దేశం నేతలు.

పవన్ కళ్యాణ్‌ను ఆయన నివాసంలో కలిసిన టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు ఇసుక కొరతపై విజయవాడలో ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షకు మద్దతివ్వాలని కోరారు. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. తమ పార్టీ తరపున మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వెల్లడించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ చేపట్టిన ఇసుక దీక్షకు మద్దత్తు ఇవ్వాలని పవన్‌ను కోరామని, ఇసుక కొరతకి సంబందించి ఎవరు నిరసన తెలిపిన మద్దతిస్తామని పవన్ తెలిపినట్లు చెప్పారు. 

ప్రభుత్వ తప్పులను గుర్తు చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఈ సంధర్భంగా విమర్శించారు అచ్చెన్నాయుడు. పవన్ ప్రెస్ మీట్ పెడితే వెంటనే ఒక మంత్రి ఒంటికాలు మీద వచ్చాడంటూ మండిపడ్డారు. ఇక విజయవాడలో చంద్రబాబు దీక్షకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, దీక్షలో పాల్గొంటారనే విషయంలో మాత్రం స్పష్టత లేదని అన్నారు.