వైసీపీకి మరో షాక్? టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే?
పెనమలూరు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో పెనమలూరు నుంచే పోటీ చేయాలని పార్ధసారధి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Penamaluru MLA Kolusu Parthasarathy
Kolusu Parthasarathy : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో జరుగుతున్న పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచేశాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీలో టికెట్ రాదని కన్ ఫర్మ్ అయ్యాక తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీ) వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైపోయారని తెలుస్తోంది.
పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పార్థసారథి నిర్ణయానికి టీడీపీ అధిష్టానం కూడా ఓకే చెప్పినట్లుగా తెలిసింది. వైసీపీని వీడాలని నిర్ణయానికి వచ్చిన పార్థసారథి టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయనతో పాటు పెనమలూరు వైసీపీ నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
Also Read : ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
మంచి ముహూర్తం చూసుకుని పార్థసారథి టీడీపీలో చేరనున్నారు. టీడీపీలో చేరితే పెనమలూరు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ టీడీపీ ఆఫర్ ఇచ్చింది. దీంతో పెనమలూరు నుంచే పోటీ చేయాలని పార్ధసారధి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక, పార్ధసారధి నిర్ణయంతో వైసీపీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రైవేట్ సంస్థల ద్వారా వైసీపీ అధిష్టానం సర్వే చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్ధసారధి పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. అయితే, తాను మచిలీపట్నం వెళ్లేది లేదని పార్ధసారధి తేల్చి చెప్పారు. తనకు మంత్రివర్గంలో కూడా చోటు ఇవ్వలేదని, ఇప్పుడు పెనమలూరు సీటు కూడా ఇవ్వకుండా చేస్తున్నారని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎంవో నుంచి పిలుపు వచ్చినా పార్థసారథి వెళ్లలేదని తెలుస్తోంది.
Also Read : తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వద్దు: హర్షకుమార్