East Godavari: వైసీపీలో శ్రుతిమించుతున్న గ్రూపుల గొడవలు.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో..
రామచంద్రాపురం రాజకీయం ఇలా కాకమీదుంటే.. కాకినాడు పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి.

East Godavari District YCP politics
East Godavari – YCP: అధికార వైసీపీకి గోదావరి తీరంలో అలజడి ఎక్కువైంది. గ్రూపుల గొడవలు శ్రుతిమించుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు చాపకింద నీరులా కనిపించకుండా ఉన్న అసమ్మతి… క్రమంగా స్వరం పెంచుకుంటోంది. గ్రూపు మీటింగ్స్.. బల సమీకరణ వరకు వస్తోంది.
కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజక వర్గంలో కనిపిస్తున్న అసమ్మతి సీను ఇప్పుడు కాకినాడ.. జగ్గంపేట నియోజక వర్గాలకూ పాకింది.. మొత్తానికి అధికార పార్టీలో సౌమ్యుడిగా పేరొందిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) రేపిన కాక రాజుకుంటోంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసమ్మతి స్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై వ్యతిరేకతతో గత వారం జరిగిన పార్టీ సమీక్ష సమావేశానికి డుమ్మాకొట్టారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్..
ఇప్పుడు ఆయన మద్దతుదారులు వెంకాయపాలెంలో ఏకంగా ఆత్మీయ సమావేశం పెట్టి.. మంత్రి వేణుపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. బోస్ దయతో గెలిచి.. ఆయనకే వ్యతిరేకంగా రాజకీయాలు నడుపాతారా? అంటూ కన్నెర్రజేస్తున్నారు వైసీపీ నేతలు, బోస్ అనుచరులు.
మంత్రి వేణు రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల ముందు బోస్‌ను మండపేట పంపింది అధిష్టానం. ఆయన స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నిలబెట్టింది.
ఇద్దరూ ఒకే సామాజిక వర్గం నేతలు కావడంతో సర్దుకుపోతారని అధిష్టానం భావించింది. అయితే గత ఎన్నికల్లో బోస్ ఓటిమి పాలయ్యారు. కానీ, మంత్రిగా అవకాశమిచ్చారు ముఖ్యమంత్రి జగన్. అయితే బోస్‌ను కొన్నాళ్ల తర్వాత మంత్రిగా తప్పించి రాజ్యసభకు పంపారు సీఎం జగన్. బోస్ స్థానంలో గోదావరి జిల్లాల నుంచి వేణుకు అవకాశమిచ్చారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా.. కాలం కలిసొచ్చి మంత్రి అయ్యారు వేణు.
వేణు, బోస్ మధ్య గ్యాప్
అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వేణుకి.. బోస్‌కి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. బోస్ అనుచరులను మంత్రి వేణు నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఇది క్రమంగా పెరిగి పెద్దదే నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయేవరకు వెళ్లింది. జులై 16 ఆదివారం నాడు బోస్ వర్గం ప్రత్యేకంగా సమావేశమై.. మంత్రిపై తీవ్ర విమర్శలు చేసింది.
మంత్రి కుమారుడి అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఆరోపించడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. 2019లో మంత్రి గెలుస్తారని ఆయన భార్య కూడా ఊహించలేదని.. కానీ బోస్ అండదండలతో గెలిచి ఇప్పుడు ఆయన అనుచరులనే తొక్కిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు బోస్ అనుచరులు..
కాకినాడు పాలిటిక్స్ మరింత హీట్
రామచంద్రాపురం రాజకీయం ఇలా కాకమీదుంటే.. కాకినాడు పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి వ్యతిరేకంగా బీసీ నేతలు గ్రూపు కడుతున్నారు. ఇక్కడ కూడా బోస్ అండదండలతో కేంద్ర పాలిత ప్రాంతం యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు బీసీల సమావేశం నిర్వహిస్తున్నారు.
మల్లాడికి… కాకినాడ ఎమ్మెల్యేకి ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. యానాంలో మల్లాడి ఓటమికి ద్వారంపూడి పనిచేశారని ఆయనకు కోపం.. అంతేకాదు మల్లాడి ప్రత్యర్థి అశోక్‌కు కాకినాడ ఎమ్మెల్యే పుష్కలంగా సహకరించారని.. అందుకే యానాం తన చేజారిపోయిందని రగిలిపోతున్నారు మల్లాడి కృష్ణారావు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పగ తీర్చుకునేలా బీసీలను ఏకం చేస్తానని కృష్ణారావు చెబుతున్నట్లు వైసీపీ కార్యకర్తల్లో టాక్ నడుస్తోంది.
అయితే కాకినాడ కేంద్రంగా ఒకవైపు బోస్.. మరోవైపు మల్లాడి బీసీ ఫెడరేషన్ మీటింగ్ పెడుతుండటం సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరుల్లో గుబులు రేపుతోంది. గతంలో బోస్, ద్వారంపూడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఆ ఇద్దరికి నప్పదని చెబుతుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి సభ, సమావేశాలు నిర్వహించడం పార్టీకి నష్టం కలిగిస్తుందని కార్యకర్తలు మదనపడున్నారు.
బోస్ ప్రత్యక్ష.. పరోక్ష సహకారం.. ప్రమేయంతో రామచంద్రాపురం.. కాకినాడ రాజకీయాలు మలుపు తిరుగుతుంటే.. జగ్గంపేటలో కుమ్మలాటలు అంతకుమించి అన్నట్లు సాగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు. ఈయనకు పోటీగా ఇప్పుడు మాజీ మంత్రి తోట నరసింహం కుమారుడు రాంజీ రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్న తోట కుటుంబం ఆకస్మిక ఎంట్రీతో ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా తమ నాయకుడు కష్టపడి పనిచేస్తే.. ఇప్పుడు తోట కుటుంబం ఆత్మీయ సమ్మేళనాలు పేరిట కార్యకర్తల్లో చీలికకు ప్రతయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే మద్దతుదారులు. మరోవైపు రాంజీ మాత్రం ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క జగ్గంపేట టిక్కెట్ తనదేనంటూ సవాళ్లు విసురుతున్నారు. కాగా, తోట వర్గం కొంతమందిని మాత్రమే సమావేశాలు పిలుస్తుండటంపై వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆత్మీయ సమావేశాలు అంటే అందర్ని పిలవాలిగాని.. కొందరికే పరిమితం చేయడమేమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏదైనా సరే ప్రస్తుతానికైతే గోదావరి తీరంలో వైసీపీ పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. కొంతకాలంగా నేతల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో పెరిగిపోయినా.. సమన్వయం చేయకున్నా అధిష్ఠానం కాలక్షేపం చేసిందని.. ఇప్పుడు ఏకంగా రీజనల్ కోఆర్డినేటర్ కేంద్రంగానే అసమ్మతి కార్యకలాపాలు జరుగుతుండటం పరిస్థితిని మరింత దిగజార్చిందని మదనపడుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికైనా హైకమాండ్ ఫోకస్ పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేది కార్యకర్తల అభిప్రాయం.
Pawan Kalyan: ఢిల్లీ చేరుకుని కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్