పిఠాపురంలో పవన్ మార్క్ రాజకీయం.. ఆయన మాటే వేద వాక్కు అంటున్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు!

అందుకే పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు.

పిఠాపురంలో పవన్ మార్క్ రాజకీయం.. ఆయన మాటే వేద వాక్కు అంటున్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు!

AP Deputy CM Pawan Kalyan

Updated On : April 29, 2025 / 9:20 AM IST

పిఠాపురం….రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ నియోజకవర్గం. జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి పిఠాపురం జనం నోళ్లలో నానుతోంది. అక్కడ ఏ చిన్న విషయం జరిగినా అందరి ఫోకస్ అటువైపే ఎక్కువగా ఉంటోంది. ఇక అవకాశం ఎప్పుడు దొరుకుతుందా?

డిప్యూటీ సీఎంను ఎలా బద్నాం చేద్దామా అంటూ విపక్షం కాచుకుని కూర్చొని ఉందన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. మరోవైపు దిగువస్థాయిలో కూటమి పార్టీల కార్యకర్తల మధ్య డిష్యూం..డిష్యూం ఫైట్స్ ఉండనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పిఠాపురం రాజకీయాన్ని జన సేనాని చక్కబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారా? చిరకాల ప్రత్యర్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి జనాలకు ఎలాంటి సంకేతాలివ్వబోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ నియోజకవర్గానికి చెందిన చిరకాల ప్రత్యర్థుల మధ్య కొత్తగా చిగురిస్తున్న స్నేహం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అన్నట్లుగా ఉంటుందట. పొలిటికల్ గా అంతగా సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతున్నా..ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ మాటే వేద వాక్కుగా సాగిపోతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంతా టాక్ విన్పిస్తోంది.

పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ మాటే శాసనం అన్నట్లుగా సాగిపోతోంది. అయితే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అంత సాఫీగా లేవని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం జనసేనాని గెలుపు వెనుక తమ శ్రమ ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మే అంటూ మెగా బ్రదర్ నాగబాబు లేపిన దుమారంతో ఆ నియోజకవర్గంలో ఏదో జరుగుతోందనే అనుమానాలే ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయట. అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ తన పర్యటనలతో ఆల్ హ్యాపీస్ అని చాటిచెప్పారట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Also Read: ఏడాదిలో నలుగురు GHMC కమిషనర్లు.. ఎందుకలా..? ఆర్వీ కర్ణన్‌ను ఎందుకు నియమించారు?

పిఠాపురం నియోజకవర్గం వరకు కూటమి పార్టీల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో ఉండగా, మరొకరు టీడీపీ సీనియర్ నేత వర్మ. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించిన వర్మ..జనసేనాని పవన్ కోసం తను సీటును త్యాగం చేశారు.

కూటమి పెద్దలు అప్పట్లో హామీ
అంతేకాకుండా పవన్ గెలుపును తన భుజస్కాంధాలపై వేసుకుని ప్రచారం చేసిన వర్మకు నామినేటెడ్ పదవి ఇస్తామని కూటమి పెద్దలు అప్పట్లో హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది పూర్తి కావొస్తున్నా, టీడీపీ నేత వర్మకు మాత్రం పదవి అందని ద్రాక్షలానే మిగిలింది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబు కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ అయి పవన్ గెలుపు కోసం పనిచేశారంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనను జనసేనలోకి తీసుకున్నారు.

టీడీపీ అధిష్ఠానం ఇచ్చిన హామీతో వర్మ..వైసీపీ అధిష్ఠానంపై అసమ్మతితో దొరబాబు కలిసి పిఠాపురంలో జనసేనాని పవన్ ను గెలిపించారనేది అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంతకాలంగా జనసేనలో ఉన్న కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటమే కాకుండా, ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అవమానాలకు గురిచేస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇలాంటి ప్రచారంతో వారి అభిమానులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు.

అదే సమయంలో కొన్నిచోట్ల వర్మ, దొరబాబు వారి వారి అనుచరులతో జనసైనికులు వీధి పోరాటాలకు దిగడం కూడా పరిస్థితిని దిగజార్చుతోందన్న చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో పిఠాపురంలో పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయంటున్నారు. ఎవరు ఏమన్నా..జన సైనికులు రెచ్చగొడుతున్నా..మీకు నేనున్నానంటూ పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు ఎక్కడా నోరు జారడంలేదంటా.

అందుకే పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు. దీనికి తాజాగా పవన్ పర్యటననే ఓ ఉదాహారణ అని చెప్తున్నారట. కొంతకాలంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నా, పవన్ పర్యటనలో ఆ ఇద్దరు కుడి, ఎడం భుజాలుగా కూర్చోవడంతో విమర్శకుల నోళ్లకు తాళం వేసినట్లు అయ్యిందట. మొత్తానికి పవన్ కల్యాణ్ తన రాజకీయ చాణక్యంతో ఇద్దరు సీనియర్లు అసంతృప్తికి గురికాకుండా చూసుకుంటూ పిఠాపురంలో తన మార్క్ రాజకీయం ప్రదర్శిస్తున్నారని అంతా టాక్ విన్పిస్తోంది.