PM Modi: కోట్లాది మందికి మార్గదర్శకులు.. భూమిపై మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయిబాబా- ప్రధాని మోదీ
నాస్తికులను సైతం ఆధ్యాత్మికంవైపు నడిపించిన మహనీయుడు సత్యసాయి అని కీర్తించారు.
PM Modi: సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం అని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని తెలిపారు. భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రం అని చెప్పారు. భక్తి, జ్ఞానం, కర్మ.. ఈ మూడూ సేవతో ముడిపడి ఉంటాయన్నారు.
”సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పింది. బాబా బోధనలు కోట్లాది మందికి మార్గం చూపాయి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు.. ఇదే బాబా నినాదం. సత్యసాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కోట్లాది మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారు. బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయి. చాలామంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారు” అని ప్రధాని మోదీ అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి- సీఎం చంద్రబాబు
ప్రేమ, సేవ, ప్రశాంతతకు సత్యసాయి ప్రతిరూపం అని సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయి సిద్ధాంతం భవిష్యత్ తరాలకు ఆచరణ మార్గం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని అన్నారు. విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమం సత్యసాయి మార్గం అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని, ప్రపంచమంతా ప్రేమను పంచారని చంద్రబాబు తెలిపారు. విదేశాలకు వెళ్తే చాలామంది సత్యసాయి గురించి చెప్పేవారని అన్నారు. నాస్తికులను సైతం ఆధ్యాత్మికంవైపు నడిపించిన మహనీయుడు సత్యసాయి అని కీర్తించారు. వేరు వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనో దర్శనంతో ప్రభావితం చేశారని చెప్పారు.
”భక్తులను ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవారు. సత్యసాయి ఆశీస్సులతో తాగునీటి పథకం అందించాం. సత్యసాయి 102 విద్యాలయాలు నెలకొల్పారు. సత్యసాయి ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించే వారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలు అందిస్తోంది. సత్యసాయి ట్రస్ట్ కు 7లక్షల మందికిపైగా వాలంటీర్లు ఉన్నారు. రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, రెండు జనరల్ ఆసుపత్రులు, రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజూ 3వేల మందికిపైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతోంది. సత్యసాయి చూపిన మార్గంలో మనం ముందుకెళ్లాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సత్యసాయి ఎంతోమందిని ప్రభావితం చేశారు- పవన్ కల్యాణ్
సత్యసాయి బాబా గొప్పతనం గురించి మన దేశస్తుల కంటే విదేశీయులే ఎక్కువగా చెబుతారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 30ఏళ్ల క్రితం సింగపూర్ వెళ్లినప్పుడు చైనీస్ ఇళ్లల్లో సత్యసాయిబాబా ఫోటోలు చూశానని తెలిపారు. 20ఏళ్ల క్రితం హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ బాబాను కలవాలని చిరంజీవిని ప్రత్యేకంగా అడిగి ఇక్కడికి వచ్చి మరీ బాబా ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు పవన్.
”బాబా వెలిసింది భారత దేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో. నీటికి కూడా కొరత ఉండే జిల్లాలో పుట్టారు. వలసలు వెళ్లే జిల్లా. అలాంటి జిల్లాను ఆయన ఎంచుకున్నారు. అలాంటి జన్మ తీసుకున్నారంటే మహానుభావులే తీసుకోగలరు. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చి పుట్టపర్తి అభివృద్ధికి పాటుపడతారని ఎవరూ ఊహించలేదు. ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: డబ్బులు పడ్డాయ్.. అకౌంట్లు చెక్ చేసుకోండి.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల..
