చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం- ప్రధాని మోదీ

రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు.

చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం- ప్రధాని మోదీ

PM Narendra Modi Nacin

PM Narendra Modi Nacin : చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ.. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో స్థాపించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) ను ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ పాల్గొన్నారు.

నాసిన్ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. నాసిన్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నట్లు తెలిపారు. ”పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మస్థలం. లేపాక్షిలో వీరభద్ర స్వామి మందిరం దర్శించుకోవడం ఆనందకరం. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. జీఎస్టీ తీసుకొచ్చి పన్నులను సరళతరం చేశాం. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలి. ఇదే రామరాజ్య సందేశం” అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధాని మోదీకి సీఎం జగన్ కృతజ్ఞతలు
ఏపీకి నాసిన్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్ స్టిట్యూట్ రావడం గర్వంగా ఉంది. నాసిన్ తో ఏపీకి ప్రపంచస్థాయి గుర్తింపు రానుంది. ఆంధ్రప్రదేశ్ పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుంది. నాసిన్ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.

”అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటైన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్, ఒక వరల్డ్ క్లాస్ అకాడెమీ రావడం ఆనందకరం. అలాంటి సంస్థను ఇక్కడికి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం, అడుగులు పడటమే కాకుండా ఇది సాధించేందుకు నిర్మలా సీతారామన్ అనేకసార్లు ఇక్కడికి రావడం, ఎఫర్ట్స్ పెట్టడం మన కళ్ల ముందు కనిపించిన వాస్తవం. నాసిన్ లాంటి సంస్థ మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ పెంచుతుంది. నాసిన్ తో ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది” అని సీఎం జగన్ అన్నారు.

ఏంటీ నాసిన్?
రాష్ట్ర విభజన కేటాయింపుల్లో భాగంగా ఏపీకి ‘నాసిన్’ రెండో కేంద్రాన్ని కేటాయించారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో నాసిన్ కేంద్రాన్ని నిర్మించారు. దేశంలో ఐఏఎస్ లకు ముస్సోరీలో, ఐపీఎస్ లకు హైదరాబాద్ అకాడెమీలో శిక్షణ ఇస్తున్నట్టే… ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్)కు ఎంపికైన వారికి ‘నాసిన్’ లో శిక్షణ ఇస్తారు. దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో రూ.541 కోట్ల వ్యయంతో ఈ ట్రైనింగ్ సెంటర్ ను నిర్మించారు. కేవలం రెండేళ్లలోనే ఈ నాసిన్ అకాడమీ నిర్మాణం పూర్తి చేశారు.

నాసిన్ కేంద్రం ప్రారంభోత్సవంతో ప్రధాని మోదీ ఏపీ పర్యటన ముగిసింది. దాంతో ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన బయలుదేరి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి నుంచి లేపాక్షి వెళ్లారు. వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి స్వయంగా హారతి ఇచ్చారు. ఆలయ అర్చకులు మోదీకి తీర్థప్రసాదాలు అందజేశారు.