శరవేగంగా పోలవరం పనులు.. 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి..

Polavaram project progress report: వరదలు వెంటాడినా పనులు ఆగట్లేదు.. కరోనా కుదిపేసినా నిర్మాణంలో జాప్యం లేదు.. నిధుల్లో కేంద్రం కోతలు పెట్టినా.. ప్రాజెక్ట్ పట్టాలు దిగలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా.. పోలవరం పరుగులు పెడుతోంది. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయ్. మరి.. పనులు ఎంతవరకొచ్చాయ్? ఇంకా ఏమేం చేయాలి? ఓవరాల్‌గా పోలవరం ప్రోగ్రెస్ ఎంతవరకొచ్చిందో ఓసారి చూద్దాం..
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా ఈ మెగా ప్రాజెక్ట్‌పై రకరకాల చర్చలు సాగుతూనే ఉన్నాయి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనేది.. ఏపీలో ఆన్సర్ లేని క్వశ్చన్ గా మారింది. కానీ.. ఇప్పుడా ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పరిస్థితులతో సంబంధం లేకుండా.. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిరాటంకంగా జరిగిపోతున్నాయి.గోదావరికి వరదలొచ్చిన ఆగని పనులు :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు వైసీపీ సర్కార్.. 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే.. పోలవరం పనులు ఎక్కడా ఆగడం లేదు.
కరోనా కేసులు పెరుగుతున్నా.. భారీ వర్షాలతో గోదావరిలో వరదలు వచ్చినా.. పోలవరం నిర్మాణ పనులు మాత్రం ఎక్కడా ఆగలేదు. శరవేగంగా మందుకు కదులుతున్నాయి.
పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన 52 పిల్లర్లు వందశాతం పూర్తయ్యాయి. గోదావరికి వరదలొస్తే పనులు నిలిచిపోకుండా.. అధికారులు ముందుగానే ప్లాన్ చేశారు.
https://10tv.in/central-govt-should-be-completed-polavaram-cm-jagan/
దీంతో.. పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో.. స్పిల్ వే, కాఫర్ డ్యామ్, పిల్లర్లపై రోడ్డు నిర్మాణ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టులోని 52 పిల్లర్ల నిర్మాణం పూర్తి అయింది. 52వ పిల్లర్ నుంచి 36వ పిల్లర్ వరకు భారీ గడ్డర్లు ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇప్పటికే.. 260 మీటర్ల పొడవునా బ్రిడ్జిపై కాంక్రీట్‌తో రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరో 125 మీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి పనులు పూర్తి చేశారు. 160 అడుగుల ఎత్తులో బ్రిడ్జిపై చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 21వ పిల్లర్ నుంచి 26వ పిల్లర్ వరకు భారీ గడ్డర్లు ఏర్పాటు చేస్తూ.. పనుల్లో వేగం పెంచారు.
స్పిల్ వేకు ఎగువన, దిగువన.. గోదావరి వరద నీరు నిలిచి ఉన్నా.. పనులు కొనసాగిస్తూనే ఉంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన కుడి కాలువ రెగ్యులేటర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. రెగ్యులేటర్ నిర్మాణం పూర్తి చేసి గేట్లు కూడా బిగించేశారు.
ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి.. రివర్స్‌లో రెగ్యులేటర్ ద్వారా ట్విన్ టన్నెల్స్ నుంచి కుడి కాలువకు నీళ్లు వెళ్లనున్నాయి. ఇప్పటికే.. రెగ్యులేటర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కుడి కాలువ రెగ్యులేటర్ పనులు దాదాపు పూర్తయిపోయాయి.
కాఫర్ డ్యామ్ నిర్మాణం 85 శాతం పూర్తి :
పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాఫర్ డ్యామ్ నిర్మాణం. ఇప్పటికే.. ఎగువ కాఫర్ డ్యామ్ 85 శాతం పూర్తి అయింది. రెండు కాఫర్ డ్యామ్‌లకు మధ్యలో గోదావరి అడుగున ఉన్న డయాఫ్రాం వాల్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైపు నిర్మాణం చేపడుతున్న పవర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా.. రెండు కొండల మధ్య గ్యాప్ వన్‌లో ప్లాస్టిక్ కాంక్రీట్‌తో డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నారు.
ఇలా.. ప్లాస్టిక్ కాంక్రీట్‌తో మూడు చోట్ల గ్యాప్‌లను అనుసంధానం చేస్తూ.. ప్రధాన డ్యామ్‌కు డయాఫ్రాం వాల్‌ను కలుపుతారు. మట్టి, రాళ్ల తవ్వకం పనులు దాదాపు 96 శాతం పూర్తయ్యాయి.
ప్రాజెక్టులోని స్పిల్ వే, స్పిల్ చానల్ పనులతో కలిపి.. ఇప్పటివరకు 90 శాతం కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా.. 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా.. 33.88 లక్షల క్యూబిక్ మీటర్ల పనులూ పూర్తిచేశారు.
ఇంకా.. 5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంది. కుడి కాలువ పనులు 100 శాతం పూర్తయ్యాయి. ఎడమ కాలువ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 82 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 85 శాతం, ట్విన్ టన్నెల్ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇప్పటికే డయాఫ్రాం వాల్ నిర్మాణం, జెట్ గ్రౌటింగ్ పనులు 100 శాతం పూర్తవడంతో.. వీటిపైనే ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం పూర్తిచేయనున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 20న కేంద్రప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్టు.. 41 శాతం పూర్తైంది. అందులో నిర్మాణ పనుల 72 శాతం పూర్తి కాగా.. భూసేకరణ, పునరావాసం మాత్రం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన స్పిల్ వే నిర్మాణంలో.. 52 పిల్లర్ల నిర్మాణం వంద శాతం పూర్తైంది. 52 పిల్లర్లను.. 52 మీటర్లకు పైగా నిర్మించారు. ఇప్పుడు వీటిపై.. బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఓ వైపు ప్రతిపక్షాలు పోలవరం పనులు ముందుకు సాగడం లేదని విమర్శిస్తున్నా.. కేంద్రంప్రభుత్వం నిధుల విషయంలో కోతలు విధిస్తున్నా.. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మాత్రం నిరాటంకంగా కొనసాగుతున్నాయి.