Prakasam Robbery Case : దోచేశారా? దాచేశారా? ఒంగోలులో దారి దోపిడీ కేసులో ఊహించని మలుపులు

ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దారి దోపిడీ ఘటన కలకలం రేపుతోంది. బంగారం షాపుల్లో పని చేసే గుమాస్తాలను బెదిరించిన దొంగలు కిలో 700 గ్రాముల బంగారం, రూ.21లక్షల నగదుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. కిలోమీటర్ దూరంలో కారుని వదిలేసి పారిపోయారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి ఫిర్యాదు ఇచ్చారు.

Prakasam Robbery Case : దోచేశారా? దాచేశారా? ఒంగోలులో దారి దోపిడీ కేసులో ఊహించని మలుపులు

Updated On : December 25, 2022 / 11:49 PM IST

Prakasam Robbery Case : ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దారి దోపిడీ ఘటన కలకలం రేపుతోంది. బంగారం షాపుల్లో పని చేసే గుమాస్తాలను బెదిరించిన దొంగలు కిలో 700 గ్రాముల బంగారం, రూ.21లక్షల నగదుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. కిలోమీటర్ దూరంలో కారుని వదిలేసి పారిపోయారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి ఫిర్యాదు ఇచ్చారు. ఖాకీలు రంగంలోకి దిగిన ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గుమాస్తాలు చెప్పిన లెక్కలకు పోలీసుల దర్యాఫ్తుకు పొంతన కుదరకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి.

నర్సరావుపేటలో బంగారం షాపుల్లో పని చేసే నలుగురు గుమాస్తాలు నంద్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో చోరీ జరిగింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట దగ్గర దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గుమాస్తాలను బెదిరించి బంగారం, డబ్బుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కిలో 700 గ్రాముల బంగారంతో రూ.21 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తొలుత పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఖాకీలు దర్యాఫ్తు మొదలు పెట్టి దొంగలు వదిలి వెళ్లిన కారుని తనిఖీ చేయగా అందులో ఓ స్పెషల్ లాకర్ కనిపించింది. అందులో కిలో బంగారంతో పాటు రూ.14లక్షల నగదు సేఫ్ గా ఉన్నాయి. దీని గురించి పోలీసులు అడగ్గా.. గుమాస్తాలు నీళ్లు నమిలారు. దొంగలు 700 గ్రాముల బంగారంతో పాటు రూ.7లక్షలు ఎత్తుకెళ్లినట్లు మాట మార్చారు.

అయితే, కారులో సెక్యూరిటీ పర్పస్ తో స్పెషల్ లాకర్ చేయించినప్పుడు మొత్తం బంగారం, డబ్బును అందులోనే ఎందుకు ఉంచలేదన్నది పోలీసుల అనుమానం. కొంత బంగారం, డబ్బును బయట ఎందుకు ఉంచుకున్నారో తేలాల్సి ఉంది. కారుని ఎత్తుకెళ్లిన దొంగలు కిలోమీటర్ దూరంలోనే దాన్ని వదిలిపెట్టారు. చోరీ చేశాక త్వరగా పారిపోవాలనుకునే దొంగలు ఘటనా స్థలానికి దగ్గరలోనే కారుని ఎందుకు వదిలిపెట్టారన్నది మరో అనుమానం.

ఇక కారులో భారీగా బంగారం, డబ్బు ఉందనే విషయం తెలియడంతోనే వారిని ఫాలో అయ్యారు దొంగలు. ముందుగా రెక్కీ చేసుకున్న వారికి అందులో ఉన్న స్పెషల్ లాకర్ గురించి తెలియకుండా ఉంటుందా? వాళ్లకు స్పెషల్ లాకర్ ఎందుకు కనిపించలేదన్నది పోలీసుల డౌట్. ఒకవేళ దొంగతనం నిజంగానే జరిగుంటే గుమాస్తాలు పోలీసులతో అబద్దం ఎందుకు చెప్పారు.

మొత్తం బంగారం, డబ్బు పోయిందని ఫిర్యాదు ఇవ్వడానికి కారణాలు ఏంటి. ఇవన్నీ తేల్చడానికి పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. మొత్తానికి దారి దోపిడీ ఘటనలో చాలా డౌట్స్ రావడంతో వాటిని క్లియర్ చేసేందుకు నలుగురు గుమాస్తాలతో పాటు కారు డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ఇంటి దొంగల హస్తముందా? లేక నిజంగానే చోరీ జరిగింది? ఇదే జరిగితే ఆ చోరీ చేసింది వ్యాపారస్తులకు తెలిసిన వారేనా? లేక అంతర్రాష్ట్ర ముఠాలా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

దొంగలు ఎత్తుకెళ్లిన బంగారం, నగదు లెక్కలపై గుమాస్తాలు మాట మారుస్తున్నారు. ఒక్కసారి ఒక్కో మాట చెబుతున్నారు. దాంతో నిజంగానే చోరీ జరిగిందా? లేక ఇంటి దొంగల హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు కంటిన్యూ చేస్తున్నారు.