Posani Arrest: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. 14రోజులు రిమాండ్.. ఎక్కడి జైలుకు తరలించారంటే?
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు రిమాండ్ విధింింది.

Posani Krishna Murali
Posani Arrest: సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు 14రోజులు రిమాండ్ విధించింది. సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో పోసాని కృష్ణమురళినీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఓబులవారిపల్లె మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి ఈనెల 24న స్థానిక పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతనిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పోసాని వాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఓబులవారిపల్లె స్టేషన్ కు తరలించారు. గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుదీర్ఘంగా విచారించారు. గురువారం రాత్రి 9.30గంటల సమయంలో రైల్వేకోడూరు కోర్టులో హాజరుపర్చారు.
Also Read: Posani Krishna Murali : తెలీదు, గుర్తులేదు..! పోలీసుల ప్రశ్నలకు నోరు విప్పని పోసాని కృష్ణమురళి..
పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో తీర్పు ఇచ్చింది. పోసానికి 14రోజులు (మార్చి 12వ తేదీ వరకు) పాటు రిమాండ్ విధిస్తూ తీర్పుఇచ్చింది. దీంతో పోసాని కృష్ణ మురళిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.