PM Modi Kurnool Tour: రేపే.. ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

రెండు కారిడార్లలో సుమారు 21వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు లక్ష మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొంది.

PM Modi Kurnool Tour: రేపే.. ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

pm narendra modi

Updated On : October 15, 2025 / 5:58 PM IST

PM Modi Kurnool Tour: ప్రధాని మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పర్యటనలో సుమారు 13వేల 430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

2వేల 880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు త్రీ పూలింగ్ స్టేషన్ అనుసంధానం చేసే ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 4వేల 920 కోట్లతో ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ లో పనులకు, పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనకు, ఎస్ గుండ్లపల్లి-కనిగిరి బైపాస్ కు శంకుస్థాపన చేస్తారు.

జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు సంయుక్తంగా ఈ రెండు కారిడార్ల అభివృద్ధి చేబడతాయని కేంద్రం తెలిపింది. రెండు కారిడార్లలో సుమారు 21వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు లక్ష మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొంది.

ఇది రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని, అంతర్జాతీయ పోటీలో నిలవడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. 960 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న సబ్బవరం-శీలానగర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రధాని శంకస్థాపన చేయనున్నారు. వెయ్యి కోట్లతో చేపడుతున్న పీలేరు-కాలూరు మధ్య నాలుగు లేన్ల రహదారి విస్తరణకు, రైల్వే ఓవర్ బ్రిడ్జికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 1200 కోట్లతో చేపట్టిన కొత్త వలస విజయనగరం నాలుగో లేన్ ను, అలాగే పెందుర్తి సింహాచలం వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.

కొత్తవలస-బొద్దవార సిమిలిగూడ గోరాపూర్ సెక్షన్లను గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ సభకు ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. సుమారు 3లక్షల మంది ప్రజలు హాజరయ్యే ఈ సభలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సభ కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను, ప్రజలు సౌకర్యంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

* రేపు ఉదయం 7గంటల 50 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు.
* ఉదయం 10.20గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
* ఉదయం 11గంటల 45 నిమిషాలకు మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు.
* మధ్యాహ్నం 2.30 గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు శంకుస్థాపన చేయనున్నారు.
* సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.
* సాయంత్రం 4.40 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

Also Read: మద్యం మరకలు.. అటుఇటు తిరిగి వైసీపీకే అంటుతున్నాయా? నెక్స్ట్‌ ఏంటంటే?