మూడు రెట్లు ఎక్కువగా చార్జీలు వసూలు, కారులో ఒక్కొక్కకరికి రూ.1200.. ప్రజారవాణా లేకపోవడంతో ప్రైవేటు దోపిడీ

private bus operators: లాక్‌డౌన్ అన్‌లాక్‌తో దాదాపుగా పూర్తిస్థాయి సడలింపులు వచ్చినప్పటికీ అంతర్రాష్ట్ర, దూర ప్రయాణాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లు అరకొరగా తిరుగుతుండటం, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో.. ఇదే అదనుగా ప్రైవేటు వాహన యజమానులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో తప్పనిసరై ప్రయాణాలు చేస్తున్నవారి జేబులకి చిల్లు పడుతోంది.
తక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు, అవి కూడా ఇతర రాష్ట్రాలవే:
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నప్పటికీ అవి తక్కువగా ఉన్నాయి. ఉన్నవాటిలో ఎక్కువ ఢిల్లీ, ఒడిశా, బెంగాల్, బిహార్‌వైపే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లేవారికి రోడ్డుమార్గం తప్పడం లేదు. ప్రైవేటు బస్సులు రాత్రి తిరుగుతుండగా.. పగలు ప్రయాణం చేయాల్సిన వాళ్లు చిన్న, పెద్ద ప్రైవేటు కార్లను ఆశ్రయిస్తున్నారు. దూర ప్రయాణాలు చేయాల్సిన వారు భారీగా చెల్లిస్తూ ఇబ్బంది పడుతున్నారు.
కార్లలో ఆర్టీసీ ఛార్జీల కంటే 2, 3 రెట్లు ఎక్కువగా చార్జీలు వసూలు:
దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి లాంటి ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ప్రయాణికుల రోడ్లపై వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. కార్లలో ఆర్టీసీ ఛార్జీల కంటే 2, 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తుంటే.. ప్రైవేటు బస్సుల్లో రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా వసూలు చేస్తే పండక్కి ఒకట్రెండు రోజుల ముందు ఇంకెంత వసూలు చేస్తారోనన్న ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది.
లబ్ది పొందుతున్న ప్రైవేటు ఆపరేటర్లు:
పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చినట్టుంది తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ పరిస్థితి. కరోనా, లాక్‌డౌన్ తర్వాత.. అంతర్రాష్ట్ర బస్సు సేవల పునరుద్ధరణపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు లబ్ధి పొందుతున్నారు. నిజానికి కిలోమీటర్ల ప్రాతిపదిక, సమాన సర్వీసులు అన్న అంశాలతో రెండు ఆర్టీసీలూ నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ఈ మాట స్వయంగా ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. ఇక చర్చలు అసంపూర్తిగా ముగుస్తుండడంతో.. ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు ఊతమిచ్చేలా.. ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నాయి.
పండుగ సీజన్‌లో అయినా క్యాష్ చేసుకోకపోతే ఎలా:
ఆర్టీసీకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు తన్నుకుపోతున్నా అధికారుల్లో చలనం రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు నష్టపోయాయి. ఇప్పుడు పండుగ సీజన్‌లో అయినా క్యాష్ చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
రైట్.. రైట్.. ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులెప్పుడు?
దసరాకు ఊరెళ్లెదేలా అని ప్రయాణికుల నిట్టూర్పు
పండుగకి బస్సుల కోసం ప్రజల ఎదురుచూపులు
ప్రజారవాణా లేక ఇష్టారాజ్యంగా ప్రైవేటు దోపిడీ
ప్రైవేట్ ఆపరేటర్లు మూడింతల ఛార్జీలు వసూలు
కారులో ఒక్కొక్కకరికి రూ.1200 వసూలు
హైదరాబాద్-విజయవాడ మధ్య తిరుగుతున్న 18వేల కార్లు
మరింత భారంగా మారుతున్న దూర ప్రయాణం
కనీసం దసరాకైనా బస్సులు నడపాలంటున్న ప్రయాణికులు
తెలుగురాష్ట్రాల ఆర్టీసీ సంస్థలకు ప్యాసింజర్ల విఙ్ఞప్తి