వంటింట్లో మంట : ఉల్లిగడ్డ కోసం క్యూలు

  • Published By: madhu ,Published On : December 4, 2019 / 01:26 AM IST
వంటింట్లో మంట : ఉల్లిగడ్డ కోసం క్యూలు

Updated On : December 4, 2019 / 1:26 AM IST

ఉల్లిధర వంటింట్లో మంటరేపుతోంది. వంద రూపాయలు చేతిలో పెడితేనే కిలో ఉల్లిపాయలు సంచిలో పడుతున్నాయి. బెజవాడలో అయితే.. వంద ఇచ్చినా ఇంకా ఇవ్వు అంటూ చేయి చాస్తున్నారు వ్యాపారులు. జాగ్రత్తగా కాదు.. అతి జాగ్రత్తగా ఉల్లిపాయలు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటావిడ కూడా ఉల్లిని మ్యాగ్జిమమ్‌ దూరం పెట్టేందుకే ప్రయత్నిస్తోంది. తాళింపులో వేయాల్సిన ఉల్లిపాయను సగం చేసి పూటకొకటి వాడుతోంది. చూసొచ్చి చెప్పకపోయినా.. మిడిల్ క్లాస్‌ ఇంట్లో జరుగుతున్నదిదే. 

కిలోకి ఓ పది ఉల్లిపాయలు తూగుతాయి. కేజీ వంద అంటే ఒక్కో ఉల్లిపాయ పది రూపాయలు పెట్టి కొంటున్నట్టే. ఇంత రేటా అనుకున్న వాళ్లు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఉల్లిపాయల కోసం రైతు బజార్లకు వెళ్తున్నారు. ఉల్లి కోసం రైతు బజార్లకు వెళ్లడం అంటే సాహసమే అన్న విషయం అక్కడికి వెళ్తేగాని తెలియడం లేదు. కొత్త సినిమా రిలీజ్‌ అయినప్పుడు మాత్రమే కనిపించే చాంతాడంత క్యూలైన్లు ఇప్పుడు రైతు బజార్లలో కనిపిస్తున్నాయి. నెల్లూరు మార్కెట్‌ను చూస్తే ఎవరైనా సరే..   నిజమే అంటారు. 

అచ్చం థియేటర్ల వద్ద ఉండే పరిస్థితే ఇక్కడా కనిపిస్తోంది. ఉల్లిని ఎలాగైనా సంచిలో వేసుకోవాలనే ఉత్సాహంతో ఎగబడడంతో తోపులాటలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తిరుపతిలో పోలీస్‌ స్టేషన్లలో ఉండాల్సిన పోలీసులు రైతు బజారులో ఉన్నారంటే.. ఇక మీరే అర్థం చేసుకోండి సిచ్యుయేషన్ ఎలా ఉందో.
రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలు పాతికకే ఇస్తున్నారని వెళ్తున్న జనానికి.. నాసిరకానివి అంటగడుతున్నారు. మెత్తబడినవి, సాయంత్రానికో రేపటికో పాడయ్యే ఉల్లిపాయలు బ్యాగులో వేస్తున్నారు.

ఏంటి ఇలాంటివి ఇస్తున్నారని ఎదురుతిరిగితే.. ఉన్నవి కూడా తీసేసుకుంటారని మగాళ్లు మారు మాట్లాడకుండా వచ్చేస్తున్నారు. కాని, ఈ విషయంలో మహిళలు మాత్రం ఊరుకోవడం లేదు. వంద రూపాయలు ఇస్తే.. ఇలాంటివా మీరిచ్చేవి అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. విజయవాడలో మహిళాగ్రహం ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. పైగా ఇలాంటి ఉల్లిపాయలను మనిషికి కిలోనే ఇస్తారట. ఇంకొక్క కిలో పొయ్యి అన్నా కూడా అవతలకు పో అంటున్నారు అమ్మేవాళ్లు. పోనీలే.. దక్కిందే అదృష్టం అనుకుంటూ వస్తున్నారు జనం. ఉల్లిపాయలు కొనలేకపోతున్నామంటూ.. ప్రకాశం జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం రాయితీకే అందిస్తున్నా.. కేజీ, రెండు కేజీలు చాలడం లేదంటున్నారు. పైగా కేజీ ఉల్లి కోసం.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోందంటున్నారు. 
Read More : విలీనం మంట : రూట్ మార్చిన పవన్..బీజేపీపై పొగడ్తలు