AP Govt : రైతులకు గుడ్న్యూస్.. 8 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు..
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.
farmers
- ఏపీలో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
- ధాన్యం కొనుగోళ్ల కోసం 1,917 కేంద్రాలు ఏర్పాటు
- కొనుగోళ్లు పూర్తయిన ఎనిమిది గంటల్లోనే డబ్బులు
AP Govt : ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోళ్లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ ప్రారంభమైంది.
Also Read : Gold Price Today : బంగారం, వెండి కొనేవాళ్లకు ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,917 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 23లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు టార్గెట్ గా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోళ్ల కోసం 5.40కోట్ల గన్నీ బ్యాగులను పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధం చేశారు. అలాగే ధాన్యం రవాణా కోసం 17,200 లారీలను జీపీఎస్ సదుపాయంతో సిద్ధం చేశారు. మొత్తంగా ఈసారి రబీ ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాక.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది.
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ధాన్యం విక్రయం జరిగిన ఎనిమిది గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తద్వారా రైతులకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత తనిఖీ, తూకం, ఆన్ లైన్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల రైతులకు కనీస మద్దతు ధర లభించనుంది.
వాట్సాప్ ద్వారా స్లాట్ బుకింగ్..
♦ రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండకుండా ఉండేందుకు ప్రభుత్వం వాట్సాప్ స్లాట్ బుకింగ్ విధాన్నిన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి రైతులు తమ ఫోన్ ద్వారా సులభంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
♦ మీ మొబైల్ నుంచి 2337359375కు Hi అని పంపించండి.
♦ మీ గ్రామానికి దగ్గరలో ఉన్న కొనుగోలు కేంద్రం, మిల్లు వివరాలు ఎంచుకోండి.
♦ మీరు ధాన్యం తీసుకురావాల్సిన సమయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి.
