AP Rains: ఏపీలో వానలేవానలు.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పొంచిఉన్న తుపాను గండం
ఏపీలో మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains
Rain Alert: ఏపీలో మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూల్, నంధ్యాల, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
అదేవిధంగా సోమవారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలుజారీ చేశారు.
మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ – గోవా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడనుంది. ఇది మరింత బలపడేందుకు అనుకూల వాతావరణం ఉంది. రాబోయే రోజుల్లో తుపానుగా బలపడే అవకాశం కూడా ఉంది. దీంతో ఈనెల 26, 27 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
మరోవైపు నైరుతు రుతుపవనాలు వేగంగా దూసుకొస్తున్నాయి. ఇప్పటికే కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజుల్లో ఏపీలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.