టీడీపీకీ రాజీనామా చేశాను.. వైసీపీలో చేరుతున్నాను: రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ కోసం 25 ఏళ్ల పాటు పనిచేశారు. మాట మాత్రం చెప్పకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడం బాధ కలిగించింది.

టీడీపీకీ రాజీనామా చేశాను.. వైసీపీలో చేరుతున్నాను: రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి

Updated On : April 9, 2024 / 12:11 PM IST

Ramesh Kumar Reddy Reddeppagari: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నియోజకవర్గ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, తనను కాదని వేరే వారికి రాయచోటి టికెట్ కేటాయించడం దారుణమని విమర్శించారు. క్రియాశీలక కార్యకర్తలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

”ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదు. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడం దారుణం. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదు. పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడి పనిచేశాను. కనీసం మాట మాత్రం చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా టికెట్ కేటాయించడం దారుణం. చంద్రబాబు అపాయింట్మెంట్ సైతం దొరకని పరిస్థితి టీడీపీలో ఉంది. తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అస్సలు లేదు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలి. వినుకొండలో రేపు జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ సభ్యత్వం తీసుకోబోతున్నాను.

Also Read: వైసీపీ మైనార్టీ వర్సెస్ టీడీపీ వైశ్య.. ఏపీ ఓల్డ్‌ కేపిటల్‌ కర్నూలులో గెలుపెవరిది?

దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి బయటి వారికి టికెట్లు ఇచ్చారు. అధికారంలోకి రాబోతున్నామని ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి డబ్బున్న వారిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు. మాకు టికెట్ ఇవ్వకపోయినా మేము బాధపడేవాళ్లం కాదు. కానీ కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్లే టీడీపీని వీడాల్సి వస్తోంది. పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కారని, నియంత పోకడలను అనుసరిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయించిన అభ్యర్థి సరైనవారు కాదు. తెలుగుదేశం పార్టీకి రాయచోటి ప్రజలు ఓటు వేయాల్సిన అవసరం లేదు. టీడీపీకి పనిచేసినట్టుగానే వైసీపీకి పనిచేయాలని నిర్ణయించుకున్నాన”ని రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు.

Also Read: ఏపీలో సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు ఇవే.. లోకేశ్‌పై పోటీ చేసేదీ ఎవరో తెలుసా?