వారి కుటుంబాలకు 10వేలు..! ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి. ఇది సవాల్ గా తీసుకొని అధికార యంత్రాంగం పని చేయాలి.
Organ Donors : బ్రెయిడ్ డెడ్ తో మరణించి అవయవదానం చేసిన దాతల భౌతిక కాయాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ లేదా సీనియర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలని ఆదేశించింది. అవయవ దాతల కుటుంబాలకు పారితోషికంగా రూ.10 వేలు ఇవ్వనున్నారు. అలాగే ప్రశంసా పత్రాలు అందించాలని మార్గదర్శకాలు జారీ చేసింది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. అవయవ సేకరణ అనంతరం ఆసుపత్రి నుంచి భౌతిక కాయాన్ని ఉచితంగా తరలించనున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి- సీఎం చంద్రబాబు
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ, ఆస్పత్రుల పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఓపెన్ మార్కెట్ తో పోటీ పడేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలన్నారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, సామాన్యుడు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగ్గ వైద్యం అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.
”కార్పొరేట్ ఆస్పత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభం లేకుండా కేవలం సేవ చేస్తున్నప్పుడు ఎందుకు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నాం? ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలి. ఇన్సూరెన్స్ కూడా అందరికీ యూనిఫామ్ గా పెట్టాలి. ప్రైవేట్ ఆస్పత్రులతో మనం ఎందుకు పోటీపడలేం? రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి. ఇది సవాల్ గా తీసుకొని అధికార యంత్రాంగం పని చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?