గుండె తరుక్కుపోతోంది.. ఇదే జగనన్న అధికారంలో ఉంటే..: రోజా
మంత్రులు విహార యాత్రలకు వెళ్లారని, ఇక్కడ ప్రజలను వరదల్లో ముంచేశారని రోజా చెప్పారు.
విజయవాడలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తే గుండె తరుక్కుపోతోందని మాజీ మంత్రి రోజా అన్నారు. జగనన్న అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే ముందుగానే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లమని అన్నారు.
పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, పాలు, మంచినీళ్లు అందించేవాళ్లమని, వరద, తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం, నిత్యవసరాలు పంపిణీ చేసేవాళ్లమని రోజా తెలిపారు. ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఎన్నో అవస్థలు పడుతున్నారని చెప్పారు.
నాలుగురోజుల నుంచి ఎంతో నరకాన్ని అనుభవించారని, పసిబిడ్డలకు పాలు కూడా అందలేదని రోజా అన్నారు. ఎంతమంది వరదల్లో కొట్టుకువెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమే కారణమని ఆమె విమర్శించారు.
మంత్రులు విహార యాత్రలకు వెళ్లారని, ఇక్కడ ప్రజలను వరదల్లో ముంచేశారని రోజా చెప్పారు. చంద్రబాబు నాయుడి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారని అన్నారు. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదని చెప్పారు.
నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోజా అన్నారు. సీఎం నుంచి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారని, 28వ తేదీనే వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయని సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. మంగళగిరిలో వర్షాలు కురిసి, విజయవాడలో వరద వస్తే మంత్రి లోకేశ్ హైదరాబాద్ కి వెళ్లిపోతారా అని నిలదీశారు. మున్సిపల్ శాఖమంత్రి నారాయణ మరో మంత్రి రామానాయుడు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు.
Also Read: గూగుల్ టాప్ సెర్చ్‌లో ఒకటిగా ‘పాస్‌పోర్ట్ సేవ’.. ఎందుకంటే?