Seediri Appalaraju: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సెంటు కొట్టుకుని అందంగా తయారవుతారు: మంత్రి సీదిరి అప్పలరాజు
రామ్మోహన్ నాయుడికి మైక్ కనపడితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారని, దాని వల్ల జిల్లాకు ఏం ఉపయోగమని అప్పలరాజు నిలదీశారు.

Seediri Appalaraju
Seediri Appalaraju – YCP: టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. టీడీపీ (TDP) ఎంపీ రామ్మోహన్ నాయుడు ( Ram Mohan Naidu ) సెంటు కొట్టుకుని అందంగా తయారవుతారని, ఆ పనిచేయడం తప్ప జిల్లాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
అంతేగాక, రామ్మోహన్ నాయుడికి మైక్ కనపడితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారని, దాని వల్ల జిల్లాకు ఏం ఉపయోగమని అప్పలరాజు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. పనికి మాలిన ఎంపీలకు ర్యాంకింగులు ఇస్తే అందులో ప్రథమ స్థానంలో నిలిచేది రామ్మోహన్ నాయుడేనని అన్నారు.
జిల్లాకు ఆయన ఏం చేశాడో గుండెలమీద చేయి వేసుకుని చెప్పాలని అప్పలరాజు నిలదీశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం చేశానో చాలా చెప్పగలనని అన్నారు. తాను కిడ్నీ ఆసుపత్రి,వాటర్ ప్రాజెక్టులను తీసుకోచ్చానని తెలిపారు. జిల్లా ప్రతిపక్ష నేతలంతా వచ్చి తన మీద వ్యక్తిగతంగా దాడి చేసినప్పటికీ పోయేదేం లేదని అన్నారు.
తనను ఏమీ చేయలేరని తెలిపారు. తాను మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తానని అప్పలరాజు అన్నారు. కింజారపు కుటుంబం కావాలంటే వచ్చి పోటీ చేయాలని సవాలు విసిరారు. చివరి ఆయకట్టుకు నీరు రాకపోవడానికి కారణం అచ్చెన్నాయుడేనని చెప్పారు. అనధికార లిఫ్టులను తన నియోజకవర్గంలో పెట్టడంతో 25 వేల ఎకరాలకు నీరు అందట్లేదని తెలిపారు. అచ్చెన్నాయుడి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.