విశాఖలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు.. ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్న కీలక నేతలు..
ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి కూడా.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

YS JaganMohan Reddy
ఒకదానికి మించి మరొకటి.. షాక్‌ల మీద షాక్‌లు.. విరిగిపడుతున్న రెక్కలు. ఇదీ విశాఖలో వైసీపీ పరిస్థితి. కీలకం అనుకున్న నేతలంతా.. వరుస పెట్టి షాక్‌లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు.. వైసీపీకి గుడ్‌బై చెప్తున్నారు. వలసలపర్వం అవంతితో స్టార్ట్ అయింది.. ఇప్పుడు అడారి దగ్గర ఆగింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది. ఫ్యాన్ పార్టీకి మరిన్ని ఝలక్‌లు తప్పవా.. విశాఖ రాజకీయాల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి..
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం.. కనీసం ప్రతిపక్ష హోదా దక్కపోవడంలాంటి పరిణామాలతో.. డీలా పడిన వైసీపీ శ్రేణులకు.. జంపింగ్‌లతో వరుస షాక్‌లు తగులుతున్నాయ్. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది. అధికారంలో ఉన్నప్పుడు చురుగ్గా కనిపించిన నేతలంతా.. ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కొంతమంది అంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటే.. మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పోటీ పడి మరీ జంపింగ్
దీంతో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు పెద్దగా స్పందన కనిపించడం లేదు. దీనికితోడు జంపింగ్‌లు పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నాయ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పోటీ పడి మరీ జంపింగ్ జపాంగ్ అంటున్నారు. విశాఖ జిల్లాలో అయితే.. వైసీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయ్.
రైతుల సమస్యలపై డిసెంబర్ 13న జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసనకు వైసీపీ అధినేత జగన్ పిలుపునివ్వగా.. సరిగ్గా ఆ కార్యక్రమం జరగడానికి ముందు రోజు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామం.. వైసీపీలో అసంతృప్తితో నేతలతో పాటు.. కార్యక్రమాలకు హాజరవడంపై తర్జన భర్జనపడుతున్న నేతలపై ప్రభావం చూపింది. 13న జిల్లా కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన నిరసనలో నేతలు, కార్యకర్తలు కలిపినా 150మంది కనిపించలేదు.
ఇక విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా… ఈనెల 23న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి వైసీపీ నిర్ణయించింది. ఈలోగా మరో షాక్ తగిలింది. 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతోపాటు డెయిరీలో డైరెక్టర్లుగా ఉన్న 12మంది కూడా వైసీపీకి రాజీనామా చేశారు.
వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి?
ఇలా ఒకరి తర్వాత ఒకరు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం.. వైసీపీ శ్రేణులను కంగారు పెడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటా అనే ఆందోళన.. ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. వెళ్లే వాళ్లు వెళ్లారు.. ఉన్న వాళ్లంతా యాక్టివ్‌గా ఉన్నారా అంటే.. ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.
విశాఖకు చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ కోలా గురువులు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వర రావులాంటి వాళ్లు.. పార్టీలో ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్లుగా కనిపిస్తున్నారు. పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ పెద్దగా కనిపించడం లేదు. మరికొందరు నేతలు అయితే.. పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విశాఖలో అవంతితో స్టార్ట్ అయిన జంపింగ్‌లు ప్రస్తుతం ఆడారి దగ్గర ఆగాయ్. ఇకపై ఏం జరగబోతుందా అనే టెన్షన్ వైసీపీ కార్యకర్తల్లో కనిపిస్తోంది.
ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి కూడా.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానంటూ తెలిపారు. ఐతే వరుసగా నేతలు పార్టీని వీడుతున్నా.. వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ధీమా తగ్గడం లేదు. ఎన్నికల నాటికి మళ్లీ కొత్త నాయకత్వం వస్తుందని.. ఇప్పుడు పార్టీని వీడిన నేతలే అప్పుడు మళ్లీ క్యూ కడతారంటున్నారు. ఎవరి ధీమా ఎలా ఉన్నా.. ఉత్తరాంధ్రలో మాత్రం ఫ్యాన్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయ్.
అసలు నర్సాపూర్‌లో ఏం జరుగుతోంది? ముగ్గురు నేతలు ఎవరికివారే యమునా తీరే!