Brahmamgari Matam : కొలిక్కిరాని బ్రహ్మంగారి మఠం వివాదం

కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా చేశారు.

Brahmamgari Matam : కొలిక్కిరాని బ్రహ్మంగారి మఠం వివాదం

Still Unclear Brahmam Gari Mutt Controversy

Updated On : June 19, 2021 / 11:00 AM IST

Brahmamgari Matam : కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా చేశారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి కూడా అందించారు. అయితే ఈ నిర్ణయాన్ని దివంగత మఠాధిపతి రెండో భార్య వ్యతిరేకించడం.. తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో మఠంలో మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో పీఠాధిపతుల బృందం తమ నిర్ణయాన్ని మాత్రం ప్రకటించింది. మునుపటి మఠాధిపతి మొదటిభార్య మొదటి కుమారుడికే మఠబాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.

అయితే ఇక్కడ ప్రభుత్వ అనుమతితోనే తాము వచ్చామని పీఠాధిపతులు చెబితే.. పీఠాధిపతుల బృందానికి ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. పీఠాధిపతుల నివేదిక తీసుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు.. మఠాధిపతిని ఎంపిక చేసే అధికారం వ్యక్తిగతంగా ఎవరికీ లేదన్నారు. నిబంధనల ప్రకారమే అన్నీ జరగాలన్నారు. అలాగే ధర్మం ప్రకారం మఠాధిపతిని ఎంపిక చేయాని పీఠాధిపతులు సూచిస్తే.. కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయంతోనే మఠాధిపతి ఎంపిక ఉంటుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పీఠాధిపతులు రాజకీయాలు చేయడం తగదంటూ ఒకింత అసహనాన్ని వ్యక్తపరిచారు.

కుటుంబ సభ్యులే ఏకాభిప్రాయానికి రావాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సూచించగా.. రెండు రోజుల్లో వారు భేటీ కానున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు భేటీ అయి చర్చించిన ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడు మరోసారి భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఏకాభిప్రాయం కుదురుతుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది.