పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి..పెరుగుతున్న బాధితులు

పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి..పెరుగుతున్న బాధితులు

Updated On : January 22, 2021 / 2:09 PM IST

Strange disease in West Godavari district : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టించింది. స్థానికులు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఇప్పటి వరకు 14 మంది అస్వస్థతకు గురికాగా.. బాధితులను ఏలూరు, గుండుగొలనులోని హాస్పిటలకు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం ఆరుగురు బాధితులు ఇంటికి చేరుకున్నారు. అయితే ఏలూరు, పూళ్ల తరహాలో వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో ఇప్పటి వరకు 36 మంది మిస్టరీ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా బత్తిన బుల్లబ్బాయ్‌ అనే వ్యక్తి చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. వింత వ్యాధికి, సదరు వ్యక్తి మృతికి సంబంధం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. సమస్యకు సరైన కారణాలు తెలియక గోదావరి జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కేసులు క్షణంక్షణం పెరుగుతున్నాయి. ఏలూరు తర్వాత పూళ్ల, కొమెరేపల్లిలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కొమెరేపల్లిలో ఇవాళ 12 కేసులు నమోదుకావడంతో ఏలూరు, దెందులూరు ఆసుపత్రిల్లో వైద్యం చేస్తోన్నారు.