ఎవరి వాదన వారిదే..! ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలపై ప్రతిష్టంభన

AP local body elections : వదల బొమ్మాళీ వదల అన్నట్లుగా ఉంది ఏపీలో సీన్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పట్టు వీడడం లేదు. మరోసారి అధికారులతో కాన్ఫరెన్స్‌కు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు… ఎస్ఈసీ తీరుపై ప్రభుత్వం ఓ రేంజ్‌లో ఫైరవుతోంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలక్షన్ నిర్వహించాలనే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. కానీ.. చివరి నిమిషంలో అది రద్దైంది. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ నీలం సాహ్ని లేఖ రాసారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ వరుస పరిణామాలతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
https://10tv.in/ysrcp-not-contesting-in-ghmc-elections/
అయితే… మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్ల కోసం చర్చించడానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీఓలతో కాన్ఫరెన్స్ కోసం ప్రభుత్వానికి అనుమతి కోరుతూ మళ్లీ లేఖ రాశారు.
అయితే రెండోసారి రమేష్ కుమార్ రాసిన లేఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు…నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. మంత్రుల వ్యాఖ్యలపై కూడా గవర్నర్‌కు కంప్లైంట్ ఇచ్చారు.
ఓ వైపు ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తుంటే… అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై దృష్టిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై చర్చించారు. పంచాయతీ ఎన్నికల అంశంలో మంత్రుల వ్యాఖ్యలపైనా, ప్రభుత్వంపైనా గవర్నర్ కు ఎస్ఈసీ ఫిర్యాదు చేయడంపైనా సీఎం చర్చించారు.
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబును కాపాడేందుకు రాజ్యాంగ వ్యవస్థలను పక్కనపెడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని.. ఎన్నికల కమిషన్‌పై తమకు పూర్తి గౌరవం ఉందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
మరోవైపు… సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీది బ్రహ్మాండమైన పాలన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమే లేదన్నారు. ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అంటుంటే… ప్రభుత్వమేమో జరగనివ్వడం లేదన్నారు. కోర్టుకెళ్లే వరకూ సమస్య పరిష్కారం కాదన్నారు జేసీ.
మొత్తంగా.. ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మార్చిలో కరోనా కారణంగా వాయిదా వేసిన ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాల్సిందేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ భావిస్తుండగా.. ఎలా జరుపుతారో చూస్తామంటూ వైసీపీ సర్కారు సవాళ్లు విసురుతోంది. దీంతో.. ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారింది.