టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసు.. నిందితులు వీరే..! త్వరలోనే వైసీపీ కీలక నేతలు అరెస్ట్?

2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.

టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసు.. నిందితులు వీరే..! త్వరలోనే వైసీపీ కీలక నేతలు అరెస్ట్?

Tdp Central Office Attack Case : టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసు విచారణలో వేగం పెంచారు పోలీసులు. తాడేపల్లికి చెందిన ఏడుగురు ఆళ్లరామకృష్ణారెడ్డి అనుచరులు దాడిలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దాడిలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఆర్కే ఆధ్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు పోలీసులు. నిందితుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టారు.

2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి తీవ్ర సంచలనం సృష్టించింది. దాడి జరిగిన రెండున్నరేళ్ల తర్వాత రెండు రోజుల క్రితం టీడీపీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు పోలీసులు.

టీడీపీ కార్యాలయంపై దాడి అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గతంలో నామమాత్రపు కేసులే నమోదయ్యాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పోలీసులు సీరియస్ గా దర్యాఫ్తు చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా దాడి ఘటనలో పాల్గొన్న వారు ఎవరు? దాడికి బాధ్యులు ఎవరు? అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే దాడి కేసులో కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్యంగా విచారిస్తున్నారు. వీరి వెనుక ఉన్న అసలైన కుట్రధారులు ఎవరు అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. వైసీపీకి చెందిన కీలక నేత, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కార్యక్రమాలు చూసే ఎమ్మెల్సీ హస్తం ఈ దాడి వెనుక ఉందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసుల అదుపులో ఉన్న వారంతా ఆ ఎమ్మెల్సీ పేరే చెబుతున్నట్లగా సమాచారం.

Also Read : ఆ కేసులు రీఓపెన్..! వైసీపీ కీలక నేతలే టార్గెట్‌గా ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

దాడి వెనుక బాధ్యులను వీలైనంత త్వరగా పోలీసులు తమ అదుపులోకి తీసుకోనున్నారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్న తర్వాతే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఫుటేజీని పోలీసులు 3 రోజుల పాటు చెక్ చేసినట్లు తెలుస్తోంది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేని విధంగా పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక విజయవాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీలైనంత తొందరలోనే వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.