రాజధాని తిరుపతిలో: టీడీపీ నేతల డిమాండ్

అమరావతిలో రాజధాని పెట్టడం వీలుకాకపోతే తిరుపతిలో పెట్టాలంటూ ఆ ప్రాంత టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి కంటే అనువైన ప్రాంతం ప్రపంచంలో మరెక్కడా లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజధానుల కోసం మూడు ముక్కలాటలాటడం మాత్రం మానాలంటూ జగన్‌కు టీడీపీ నేతలు సూచనలు చేశారు. రాజధానులను మార్చుకుంటూ పోతుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం వస్తుందంటూ హెచ్చరికలు చేశారు.
తిరుపతిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి అమరనాథ రెడ్డి.. ఏపీలో ఏం జరుగుతుందో? ఏమి జరగబోతోందో అర్థం కాని పరిస్థితి ఉందని, ప్రజల్లో అయోమయం క్రియేట్ చేస్తున్నారని అన్నారు. మద్రాసు నుంచి కర్నూలు, అక్కడ నుంచి హైదరాబాద్, నవ్యాంధ్రలో అమరావతి, ఇప్పుడు మూడు ముక్కలాటలను ప్రజలచేత పాలకులు ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని అయితే అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమకు నడిబొడ్డున ఉంటుందని చంద్రబాబు భావించారని ఆయన చెప్పారు.
రాజధానిని 50వేల ఎకరాలతో ఏర్పాటు చేశారని, అందులో ఇప్పటికే 80శాతం రోడ్లు పూర్తయ్యాయని, అసెంబ్లీ, సచివాలయం, విద్యాసంస్థలు, అధికారుల క్వార్టర్స్ పూర్తయ్యాయని ఆయన వివరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధానులు మారతాయని ఎవరూ ఊహించలేదని అన్నారు. జగన్ పాలనతో ప్రజలు అసహనానికి గురవుతున్నారని తెలుసుకుని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. తిరుపతి నుంచి వైజాగ్ పోవాలంటే ఎంత కష్టమో.. వెళ్తే తెలుస్తుందని, అందుకే తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయాలని, అందుకు అనుకూలమైన పరిస్థితులు తిరుపతిలో ఉన్నాయేని అన్నారు.