విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే.. మనిషి నుంచి తలను వేరు చేయడమే

Visakhapatnam steel plant privatization : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకునే ప్రస్తకే లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కాదు…తెలుగు ప్రజల గుండె చప్పుడు అని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై లక్షమందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే మనిషి నుంచి తలను వేరు చేయడమే అవుతుందని పేర్కొన్నారు.
పదవులను త్యాగం చేసైనా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు ముందుకు రాకుంటే ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతుందని చెప్పారు. నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కు నష్టాలు రావడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడమే నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పాలన్నారు.
రాజకీయాలు, ప్రాంతాలకతీతంగా ప్రజా ఉద్యమంలా తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా మీడియా ప్రధాన పాత్ర పోషించాలన్నారు. గతంలో జరిగిన ఉద్యమాల్లో మీడియాతో పాత్ర ప్రధానంగా ఉందని గుర్తు చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మంచి కవరేజ్ ఇస్తున్నారని, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమంగా మారడానికి మీ వంతు సహకారం కావాలని, ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకునే వ్యక్తుల మనసు మారే విధంగా, వారిపై ఒత్తిడి తెచ్చే లాగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాని రిప్రగేషన్స్, రియాక్షన్స్ దానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయో గతంలో చాలా సార్లు చూశామని చెప్పారు. చలిని లెక్కచేయకుండా, రోడ్లపై పడుకుని రైతులు మొక్కవోని దీక్షతో పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం వచ్చింది..దానిపై ఎలా పోరాటం చేస్తున్నారో చూస్తున్నామని చెప్పారు. అలాగే ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కూడా ప్రజా ఉద్యమంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయాలు, పార్టీలకు దీన్ని క్లెయిమ్ చేసుకోకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ఉపాధి లభిస్తుందన్న నమ్మకంతోనే నాడు వేలాది మంది తమ భూములు ఇచ్చారని తెలిపారు. నాన్ పొలిటికల్ జేఏసీని తొందరల్లో ఏర్పాటు చేసుకుంటామని, అన్ని పార్టీలను కలుపుకుని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృసి చేస్తామని చెప్పారు.