టార్గెట్@ 2024…టీడీపీ వ్యూహకర్తగా పీకే ఫ్రెండ్ నియామకం!

  • Published By: venkaiahnaidu ,Published On : February 13, 2020 / 01:38 PM IST
టార్గెట్@ 2024…టీడీపీ వ్యూహకర్తగా పీకే ఫ్రెండ్ నియామకం!

Updated On : February 13, 2020 / 1:38 PM IST

టీడీపీ అధినేత వ్యూహం మార్చారు. 1980,90ల్లో నాటి రాజకీయ పరిస్థితులకు,నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని, ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసి అధికారంలోకి రావాలంటే కొత్త వ్యూహాలు అవసరమని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై నడిపిన బాబుగారు…ఇకపై కొత్త వ్యూహాలు పన్నేందుకు ఓ వ్యూహకర్తను తీసుకొచ్చినట్లు సమాచారం. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం రాబిన్ శర్మ అనే వ్యూహకర్తను టీడీపీ నియమించుకున్నట్లు తెలుస్తోంది. 

టీడీపీ ప్రచార వ్యూహాలకు కమాండర్ ఇన్ చీఫ్ గా రాబిన్ శర్మ ఇకపై ఉండనున్నారు. ఇప్పటికే స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రచార వ్యూహం కోసం రాబిన్ శర్మ తన 20మంది టీమ్ తో రంగంలోకి దిగినట్లు సమాచారం. వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రకటన అనంతరం టీడీపీ పరిస్థితి ఏవిధంగా ఉందో అంచనావేసేందకు ఏపీలోని పలు జిల్లాల్లో ఈ బృందం పర్యటిస్తోందట. ఈ నెల చివర్లో చంద్రబాబునాయుడికి ఈ బృందం తమ రిపోర్ట్ ను సమర్పించనుంది.

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్(CAG),ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-PAC)కి సహ వ్యవస్థాపకుడే ఈ రాబిన్ శర్మ. రాబిన్ శర్మ ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. 2014లో మోడీకి… చాయ్ పే చర్చా క్యాంపెయిన్ ను నిర్వహించిన CAG చీఫ్ క్యాంపెయిన్ హెడ్ గా రాబిన్ శర్మపనిచేశారు. 2015లో ఐ-ప్యాక్ ద్వారా నితీష్ కుమార్ కి.. హర్ ఘర్ నితీషే,హర్ మాన్ నితీషే క్యాంపెయిన్లను నిర్వహించారు.

అయితే ఆ తర్వాత ఆయన ఐ-ప్యాక్ నుంచి బయటికొచ్చేశారు. 150కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తో ప్రస్తుతం టీడీపీ రాబిన్ శర్మను నియమించుకుందట. కుల పార్టీ అంటూ టీడీపీపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రతివ్యూహాలను పన్నాలని శర్మకు ఆదేశాలు అందాయట. నాలుగున్నర సంవత్సరాల పాటు చంద్రబాబుకి,ఆయన కుమారుడు లోకేష్ కి రాబిన్ శర్మ అందుబాటులో ఉంటాడు. ఆయన టీమ్ మాత్రం నిరంతరం టీడీపీ స్టేటస్ ను పెంచే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా జిల్లాలవారీ రిపోర్ట్ లను ప్రిపేర్ చేయడంలో నిమగ్నమవుతుంది. ఈ టీమ్ ముఖ్యంగా ప్రధాన ఇష్యూస్ గా ఉన్న నిరుద్యోగం పై పనిచేయనుంది. రాబిన్ శర్మ మెయిన్ టాస్క్ 2024లో టీడీపీకి మెజార్టీ అసెంబ్లీ స్థానాలను తీసుకురావడం. దాదాపు 170 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఈ టీమ్ పనిచేస్తోంది. 

2019లో వైయస్ఆర్ సీపీ అధికారంలోకి తీసుచ్చేందుకు ఆ పార్టీకి క్యాంపెయిన్ అడ్వైజర్ గా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే. జగన్ ఇమేజ్ తో పాటు, పీకే వ్యూహాలు,క్యాంపెయిన్ ఫార్ములాలు వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పీకే వ్యూహాలు కారణంగా టీడీపీ అధికారం కోల్పోయి కేవలం 23సీట్లకే పరిమితం కాగలింది. దీంతో ఎలాగైనా మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాల్లో ఒకటిగా ఈ రాబిన్ శర్మ నియామకంను చూడవచ్చు. రాబిన్ శర్మ వ్యూహాలు టీడీపీని 2024లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనికొస్తాయో,లేదో అన్నది చూడాలి మరి.