గజగజ.. ఆంధ్రా కశ్మీర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

Lambasingi: లంబసింగి… గాలిని సైతం గడ్డ కట్టించే చలి… దట్టమైన పొగమంచు…హిమ తుంపరులు…అతిచల్లని గాలులు… పూల సొగసులు. చలికాలం వచ్చిందంటే ఈ ఆంధ్రా కశ్మీర్ అందాలు చూడాల్సిందే. దట్టంగా కురుస్తోన్న మంచుతో లంబసింగి మరింత అందంగా కనిపిస్తోంది. ఆంధ్రా కశ్మీర్ లంబసింగిలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శీతాకాలం కావడంతో చలి తీవ్రత మరింత పెరిగింది.
లంబసింగిలో మంచు కదులుతున్న దృశ్యాలు ప్రజలను కట్టిపడేస్తున్నాయి. దానికి తోడు ఏజన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తున్న వలిసే తోటలు లంబసింగి అందాన్ని మరింత పెంచాయి. ప్రతి సంవత్సరం చలి కాలం వచ్చిందంటే చాలు.. లంబసింగిని మంచు దుప్పటి కప్పేస్తుంది. దక్షిణాదిలో అతిశీతల ప్రాంతంగా.. ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగిని ఇప్పుడు పొగమంచు కమ్మేసింది.