Tirumala Barbers Protest : దుస్తులు విప్పి, దాడులు చేస్తున్నారంటూ.. తిరుమలలో క్షురకుల మెరుపు ధర్నా

తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో క్షురకులు ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ తనిఖీలకు నిరసనగా విధులు బహిష్కరించి కళ్యాణకట్టలో ఆందోళన చేపట్టారు. తమపై విజిలెన్స్ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

Tirumala Barbers Protest : దుస్తులు విప్పి, దాడులు చేస్తున్నారంటూ.. తిరుమలలో క్షురకుల మెరుపు ధర్నా

Tirumala Barbers Protest : తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో క్షురకులు ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ తనిఖీలకు నిరసనగా విధులు బహిష్కరించి కళ్యాణకట్టలో ఆందోళన చేపట్టారు. తమపై విజిలెన్స్ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో చేరము అని చెప్పినందుకే దాడులు చేస్తున్నారని అన్నారు.

గత 12ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ దాడులు ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తులు విప్పి తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటని మండిపడుతున్నారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ లో చేరేందుకు ఇష్టం లేక కోర్టుకి వెళ్లామని చెప్పారు. ఇందుకే తమపై దాడులు చేస్తున్నారని, ఇలా దాడులు కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీటీడీ విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారని కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న పీసీ రేటు క్షురకులు ఆరోపించారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో తాము విలీనం అవ్వకపోవడంతోనే ఇలా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. గురువారం ఉదయం నుంచి తమని విధులు చేసుకోనివ్వకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు.

”విజిలెన్స్ సీఐ, మహిళా కానిస్టేబుళ్లు వచ్చారు. నందకంలో 39 మంది మేుము డ్యూటీ చేస్తున్నాం. లేడీస్ ను, జెంట్స్ ను అందరినీ పిలిచారు. యాత్రికులను లోనికి రానివ్వలేదు. మా చీరలు, జాకెట్లు అన్నీ చెక్ చేశారు. అంత చెక్ చేయాల్సిన అవసరం ఏముంది? మేము ఏమైనా 70వేల జీతగాళ్లమా? శ్రీవారికి సేవ చేసుకుంటున్నాం. ఏదో యాత్రికులు పది రూపాయలు ఇస్తే దాన్ని టిఫిన్ కో టీ కో చార్జీకో వాడుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి డ్యూటీలు చేసుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారు? 12ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు వచ్చి మమ్మల్ని వేధిస్తున్నారు?” అని మహిళా క్షురకురాలు వాపోయారు.

”మేము దొంగలం కాదు. యాత్రికులు ఇచ్చింది తీసుకుంటాం. 12ఏళ్లుగా దేవుడికి సేవ చేసుకుంటున్నాం. మమ్మల్ని పీడించి, సతాయించి, మానసికంగా వేధిస్తున్నారు. మేము డ్యూటీలు చేయలేకపోతున్నాం. ఏమైనా అడిగితే, మాకు పైనుంచి అధికారుల ఆర్డర్ అని చెబుతున్నారు. మా సెల్ ఫోన్లు తీసుకుంటున్నారు. మా లాకర్లు చెక్ చేస్తున్నారు. మా బట్టలన్నీ విప్పి చెక్ చేస్తున్నారు. మీ కథ చూస్తామంటున్నారు. మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు” అని ఓ క్షురకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.