Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. రాత్రి 9.30 తరువాత ఆ రూట్లు బంద్

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను...

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. రాత్రి 9.30 తరువాత ఆ రూట్లు బంద్

TTD

Updated On : February 15, 2025 / 10:56 AM IST

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 12ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించడం లేదు.. రాత్రి 9.30గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు.

Also Read: YSRCP: మొన్న కేతిరెడ్డి.. నిన్న వాసుపల్లి.. వైసీపీ నేతల అసంతృప్తి రాగం.. ఏం జరుగుతోంది.. పూర్తి వివరాలు?

తిరుమల నడక మార్గంలో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం చిరుతల సంచారమే. తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యల్లో భాగంగా నడక మార్గంలో పలు ఆంక్షలు విధించారు. ఆ మార్గంలో విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.

Also Read: TDP: అప్పుడు కుప్పం.. ఇప్పుడు పులివెందుల.. జగన్‌ కంచుకోటలో టీడీపీ జెండా ఎగిరేనా? కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా..

గురువారం రాత్రి అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి సమీపంలో చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై పెద్దపెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత సంచారంతో భక్తులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు.. నడక మార్గంలో ఆంక్షలు విధించారు.

 

2023 ఆగస్టు నెలలో తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి 8గంటల సమయంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేయడంతో చిన్నారిని చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లింది. మరుసటిరోజు ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో బాలిక మృతదేహాన్ని టీటీడీ సిబ్బంది గుర్తించారు. ఆ విషాద ఘటనతో కాలినడక మార్గంలో భద్రతను ఏర్పాటు చేశారు. ఆ తరువాత అటవీశాఖ అధికారులు చిరుతల జాడను గుర్తించి బోనుల్లో బంధించారు. అయితే, తాజాగా మరోసారి కాలినడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తుంది.

 

తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70కోట్లు సమకూరింది.