TTD : తిరుమలలో టీటీడీ అగరబత్తీల కేంద్రం ప్రారంభం

టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల తయారీ కేంద్రం ప్రారంభమైంది. సోమవారం అగరబత్తీలను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను చేపట్టింది.

TTD : తిరుమలలో టీటీడీ అగరబత్తీల కేంద్రం ప్రారంభం

Ttd

Updated On : September 13, 2021 / 12:19 PM IST

TTD incense sticks : తిరుమలో టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల తయారీ కేంద్రం ప్రారంభమైంది. సోమవారం అగరబత్తీలను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయాల్లో వినియోగించిన పూలు ఇది వరకు వ్యర్థం అయ్యేవి.. మళ్లీ భక్తులకు ఉపయోగపడాలని నిర్ణయం మేరకు అగరబత్తీల తయారీకి సిద్ధపడ్డామని తెలిపారు. చాలా కంపెనీలతో మాట్లాడి చివరకు దర్శన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. సప్తగిరులకు గుర్తుగా ఏడు బ్రాండ్స్ తో అగరబత్తీలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. వాడిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించామని చెప్పారు. దీన్ని లాభాపేక్షతో చేయడం లేదని.. కేవలం పూలు వ్యర్థం కాకూడదని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి, తిరుమలలో ఇది భక్తులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తిరుమలలో శ్రీవారి ఆలయ పూలు మినహా మిగిలిన ఆలయాల పూలు వాడుతున్నామని వెల్లడించారు. రోజుకు 3.50 లక్షల అగరబత్తీలు తయారు చేయనున్నామని పేర్కొన్నారు.

AP Govt: టీటీడీ నుండి దేవాదాయశాఖకు ఏటా రూ.50 కోట్లు.. ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ!

ఇదే పూలతో స్వామి చిత్రపటాలు, డాలర్లు, కీ చైన్లు తదితర వస్తువులు తయారు చేయనున్నామని తెలిపారు. ఇందుకోసం వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రూ.83 లక్షలతో యంత్రాలు కొనుగోలు చేసి, పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధునాతన డిజైన్ తో సప్తగిరి మాస పత్రిక మళ్లీ ప్రచురిస్తున్నామని తెలిపారు. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారీ చేపట్టింది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను విడుదల చేసింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తీల విక్రయానికి టీటీడీ నిర్ణయించింది.