YV Subba Reddy : వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వైవీ సుబ్బారెడ్డి ముందే రెండు వర్గాల ఘర్షణ
వైవీ సుబ్బారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. ఎవరూ వినిపించుకోలేదు. పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. YV Subba Reddy - Alluri District
YV Subba Reddy – Alluri District : అల్లూరి జిల్లా అరకు వైసీపీలో వర్గపోరు బయటపడింది. వైసీపీ ఆత్మీయ సభకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి ముందే రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. వైవీ సుబ్బారెడ్డి ఎదుట పాల్గుణ జగన్ ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరో వర్గం వారు వైవీ సుబ్బారెడ్డి వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు కూడా హాజరయ్యారు. రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. జగన్ ముద్దు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. ఎవరూ వినిపించుకోలేదు. పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి తాను చెప్పదలుచుకున్నది చెప్పేసి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో.. మరోసారి ఆయన కాన్వాయ్ కు అడ్డుపడి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read..Pinipe Viswarupu: పినిపే విశ్వరూప్ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు
మొదటి నుంచి అరకు నియోజకవర్గంలో వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే పాల్గుణ ఏకపక్ష ధోరణిలో వెళ్తున్నారు, కేవలం వాల్మికిలకు మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఓ వర్గం వారు మొదటి నుంచి కూడా అక్కడ ఆరోపిస్తున్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ పదవి శెట్టి రోహిణికి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, మరొకరికి జెడ్పీ ఛైర్మన్ పదవి లభించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. శెట్టి రోహిణి, శెట్టి అశోక్ లు ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిబాబుకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో వర్గపోరు మరింత తీవ్రమైంది.