Vallabhaneni Vamsi : కొన్నిరోజులుగా నో సౌండ్.. అంతుచిక్కని వల్లభనేని వంశీ రాజకీయం, తెరవెనుక ఏం జరుగుతోంది?
ఎమ్మెల్యే వంశీ సహజశైలికి భిన్నంగా కన్పిస్తున్న ప్రస్తుత రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. Vallabhaneni Vamsi Silence

Vallabhaneni Vamsi Silence
Vallabhaneni Vamsi Silence : ఏపీ రాజకీయాల్లో డైనమైట్ లాంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మౌనం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. తనపై చేసే చిన్న విమర్శకు కూడా గట్టిగా రియాక్ట్ ఎమ్మెల్యే వంశీ.. కొన్నిరోజుల నుంచి ఎలాంటి సౌండ్ చేయడం లేదు. ఇటీవల టీడీపీలో చేరిన మాజీ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు, ఆ తర్వాత యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హెచ్చరికలపైనా స్పందించలేదు ఎమ్మెల్యే వంశీ. ఎప్పుడూ పరుష పదాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వంశీ.. ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారా? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది.
ఏపీ రాజకీయాలకు కొన్ని రోజులుగా గన్నవరం కేంద్రంగా మారింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టార్గెట్ గా అస్త్రాలు సంధిస్తోంది తెలుగుదేశం. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై తరుచూ విరుచుకుపడే వంశీని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది టీడీపీ. సరైన, సమర్థుడైన నేత కోసం ఇన్నాళ్లు గాలించింది.
సరిగ్గా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ.. వైసీపీకి రాజీనామా చేసే సమయంలో తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ అంటే అభిమానం ఉందని చెబుతూనే వంశీ కోసం తనకు అన్యాయం చేశారని వాపోయారు. వంశీపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది తెలుగుదేశం. యువ సారథి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో వంశీని పిల్ల సైకోగా అభివర్ణించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని, గుణపాఠం చెబుతామని గట్టి హెచ్చరికలు చేశారు లోకేశ్.
సహజంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ విమర్శలపై వైసీపీలో ముందుగా రియాక్ట్ అయ్యేది మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలే. అలాంటిది డైరెక్ట్ గా తననే టార్గెట్ చేసినా వంశీ పల్లెత్తు మాట మాట్లాడకపోవటంపై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టీడీపీ రెచ్చగొట్టినట్లు మాట్లాడినా రెచ్చిపోకుండా పరిణితి ప్రదర్శించానని చెప్పాలనుకుంటున్నారా? లేక సమయం కోసం వేచి చూస్తున్నారా? ఎమ్మెల్యే వంశీ రాజకీయ వ్యూహం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎమ్మెల్యే వంశీ సహజశైలికి భిన్నంగా కన్పిస్తున్న ప్రస్తుత రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.