విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు సరే.. కానీ.. టీడీపీ నేతల ఫైరింగ్ రియాక్షన్స్

వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు సరే.. కానీ.. టీడీపీ నేతల ఫైరింగ్ రియాక్షన్స్

Vijayasai Reddy

Updated On : January 25, 2025 / 2:44 PM IST

Vijayasai Reddy: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న, వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఇకనుంచి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నా.. నా భవిష్యత్తు వ్యవసాయమే అంటూ విజయసాయిరెడ్డి శుక్రవారం రాత్రి ట్వీట్ చేసిన దగ్గర నుంచి అసలు వైసీపీలో ఏం జరుగుతుందన్న చర్చ కొనసాగుతుంది. ఎవరూ ఊహించని విధంగా రాజ్యసభకు రాజీనామా చేస్తున్నానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతోపాటు శనివారం ఉదయాన్నే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ నివాసానికి వెళ్లి తన రాజీనామా లేఖ సమర్పించారు. కొద్ది గంటలకే చైర్మన్ విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ వ్యవహారం మొత్తం చకచకా జరిగిపోగా.. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read: Vijayasai Reddy: రాజీనామాకు కారణాలను వెల్లడించిన విజయసాయిరెడ్డి.. జగన్ గురించి మాట్లాడుతూ..

విజయసాయిరెడ్డి రాజీనామా తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవటానికేనని. జగన్, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే ఇదంతా అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్లా అంటూ నిలదీశారు. వైసీపీ అధికారంలోకి రాకమునుపు దోచుకున్న కోట్లాది రూపాయలతోపాటు ఐదేళ్ల వైసీపీ హయాంలో జగన్ రెడ్డితో కలిసి దోచేసిన లక్షల కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టాలని, అప్పుడైనా విజయసాయిరెడ్డిని భగవంతుడు క్షమించే అవకాశం ఉంటుందని సోమిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయి రాజీనామాపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయం.. జగన్ రెడ్డి డిస్ క్వాలీఫై అవుతాడు.. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

విజయసాయిరెడ్డి రాజీనామాపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి ఉన్న ఐధేళ్లు విశాఖ ప్రజలకు ఒక పీడకల.. ఆయన కన్ను పడిన భూములు వారికి దక్కాల్సిందే.. నా భూములే చాలా వరకు ఉన్నాయి. బెదిరించి తీసుకుని వారి కుటుంబాల పేరుమీద మార్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే జాలి, నవ్వు, ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ద్వారా నష్టపోయిన వారికి ఎవరు న్యాయం చేస్తారని గంటా ప్రశ్నించారు. ఆయన రాజీనామా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని గంటా అన్నారు. వైసీపీ ఖాళీ అయిపోవటం ఖాయమని, చివరికి జగన్ మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోతాడంటూ గంటా పేర్కొన్నాడు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ.. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నారు. ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవటం మంచిదే.. కానీ, రాజీనామాతో ఆయన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం కరెక్టు కాదని.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 

విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత, విజయసాయి రెడ్డి బావమరిది గడికోట ద్వారాకానాథ్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను టీడీపీలో జాయిన్ అయ్యే రోజే చెప్పా.. మా బావ విజయసాయి రెడ్డిని టీడీపీలోకి తీసుకువస్తా అని. సొంత తల్లి, చెల్లి వైసీపీలో ఇమడలేక బయటకు వచ్చారు. రానున్న ఆరు నెలల్లో వైసీపీ కనుమరుగు అవుతుందని, 2025 చివరికి వైసీపీలో మిగిలేది జగన్ ఇక్కడే అని ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.. జగన్, విజయసాయిరెడ్డి కొత్త డ్రామాలో భాగంగానే విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేశాడని అన్నారు. విజయసాయిరెడ్డి చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేల్చాలని, విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి సీబీఐ అనుమతి ఇవ్వకూడదని ట్వీట్ లో కోరారు. మొత్తానికి విజయసాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారగా.. టీడీపీ నేతలు మాత్రం కేసుల నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేశాడంటూ విమర్శిస్తున్నారు.