Covid Control Village : ఊరంతా ఒక్కటై… కట్టుబాటుగా కరోనా కట్టడి

ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కరోనా వేళ ప్రజల క్షేమమే లక్ష్యంగా.. ఆ గ్రామ పెద్దలు కష్టమైనా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను గ్రామస్తులంతా ఇష్టంగానే ఆచరిస్తున్నారు. అందరూ ఒక్కటై కట్టుబాటుతో కరోనా వైరస్‌ను కట్టడి చేస్తున్నారు.

Covid Control Village : ఊరంతా ఒక్కటై… కట్టుబాటుగా కరోనా కట్టడి

Covid Control Village

Updated On : May 19, 2021 / 9:42 AM IST

Covid Control Village : ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కరోనా వేళ ప్రజల క్షేమమే లక్ష్యంగా.. ఆ గ్రామ పెద్దలు కష్టమైనా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను గ్రామస్తులంతా ఇష్టంగానే ఆచరిస్తున్నారు. అందరూ ఒక్కటై కట్టుబాటుతో కరోనా వైరస్‌ను కట్టడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పెదపట్టపు పాలెం విజయగాథ ఇది. మత్స్యకార గ్రామమైన పెదపట్టపు పాలెంలో 4,329 జనాభా ఉండగా.. వారిలో పురుషులు 2,147 మంది, మహిళలు 2,098 ఉన్నారు.

గత నెలలో ఆ గ్రామంలో రెండు పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. వెంటనే గ్రామ కాపులు (మత్స్యకార పెద్దలు) అప్రమత్తమయ్యారు. ఇకపై గ్రామంలో ఒక్క కేసు కూడా రాకుండా చేయాలనే లక్ష్యంతో కఠిన నిర్ణయాలు తీసుకుని.. సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు తీర్మానం చేశారు. దురాయి (చాటింపు) వేయించి.. ప్రజలు ఎవరైనా నిబంధనలను వ్యతిరేకిస్తే జరిమానా తప్పదని తెలియజేశారు.

నిర్ణయాలివీ..
► ఇంట్లోంచి బయటకొచ్చి తిరగకూడదు.
► గ్రామంలోకి బయట వాళ్లు ఎవరూ రాకూడదు. గ్రామంలోని వారెవరూ బయటకు వెళ్లకూడదు.
► బైక్‌ బయటకు తీయకూడదు. నడపకూడదు. బైక్‌ నడిపితే రూ.5,000 జరిమానా.
► మద్యం, కల్లు దుకాణాల వద్దకు వెళ్లకూడదు, సేవించకూడదు. పేకాట ఆడకూడదు.
► మాస్క్‌ విధిగా ధరించాలి. మాస్క్‌ పెట్టుకోకపోతే రూ.100 జరిమానా.
► గ్రామం మీదుగా వెళ్లేవారిని ఆపి మాట్లాడకూడదు. వారి బైక్‌ కూడా ఎక్కకూడదు.
► గ్రామంలో కూరగాయలు, సరుకులు విక్రయించకూడదు, కొనకూడదు.
► పై నిర్ణయాలను ఎవరైనా అతిక్రమిస్తున్నట్టు గుర్తించి సమాచారం ఇచ్చిన వారికి రూ.2,500 బహుమతి.

ఈ నిర్ణయాల ఫలితంగా గత నెలలో వచ్చిన రెండు కేసులు తప్ప కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారిద్దరూ హోమ్‌ ఐసోలేషన్‌లో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందారు. ఈ నెల 21వ తేదీ వరకు ఇలా సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఆ తరువాత ఒక రోజు గ్రామస్తులు సరుకులు కొనుక్కునేందుకు అవకాశం కలి్పస్తారు. ఆ రోజు గ్రామంలోని దుకాణదారులు బయటకు వెళ్లి అవసరమైన అన్ని సరుకులు తెచ్చి గ్రామస్తులకు విక్రయిస్తారు.

ఆ తరువాత మరో 14 రోజులపాటు తిరిగి కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయి. కరోనా ఉధృతి తగ్గే వరకు ఈ నిర్ణయాలను కచ్చితంగా అమలు చేయాలని గ్రామ కాపులు తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా.. ఆరోగ్యం బాగోలేకపోయినా ముందుగా గ్రామ కాపులను సంప్రదిస్తే వారు తగిన జాగ్రత్తలతో వారిని పంపిస్తారు.