మూడు రాజధానులు : చంద్రబాబుకి షాక్ ఇచ్చిన విశాఖ టీడీపీ నేతలు

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 05:10 AM IST
మూడు రాజధానులు : చంద్రబాబుకి షాక్ ఇచ్చిన విశాఖ టీడీపీ నేతలు

Updated On : December 25, 2019 / 5:10 AM IST

మూడు రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. త్రీ కేపిటల్ ఫార్ములాని కొందరు సమర్థిస్తే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. 8 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో ఇదే పరిస్థితి ఉంది. జగన్ నిర్ణయానికి కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తే.. మరికొందరు టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

మూడు రాజధానులపై టీడీపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబే తప్పుపట్టారు. అయితే విశాఖ టీడీపీ నేతలు మాత్రం.. సీఎం జగన్ ప్రకటనను స్వాగతించడం విశేషం. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించే అంశంపై స్థానిక టీడీపీ నేతలు సమావేశం అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని వారు నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదిస్తామని చెప్పారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయడం కరెక్టే అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.. సీఎం జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ఎంపిక చేయడం అన్ని రకాలుగా కరెక్ట్ అన్నారు.

మూడు రాజధానులపై టీడీపీ నేతలు తలో మాట మాట్లాడటం.. పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. చంద్రబాబుని వ్యతిరేకించి విశాఖ జిల్లా టీడీపీ నేతలు నిర్ణయం తీసుకోవడం పార్టీ కేడర్ ను ఆందోళనలో పడేసింది. అసలేం జరుగుతోందో అర్థం కాక కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. దీనిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.