Vizag Youth: ఎవరెస్టుపై జాతీయ జెండా ఎగరేసిన విశాఖ యువకుడు

విశాఖలోని పీఎం పాలెం ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మీష్‌వర్మ అనే యువకుడు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్‌ ఒకటో తేదీన ఎవరెస్ట్‌ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించి హిమాలయాల దిగువకు సురక్షితంగా చేరుకున్నారు.

Vizag Youth: ఎవరెస్టుపై జాతీయ జెండా ఎగరేసిన విశాఖ యువకుడు

Vizag Youth

Updated On : June 5, 2021 / 9:01 AM IST

Mount Everest: విశాఖలోని పీఎం పాలెం ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మీష్‌వర్మ అనే యువకుడు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్‌ ఒకటో తేదీన ఎవరెస్ట్‌ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించి హిమాలయాల దిగువకు సురక్షితంగా చేరుకున్నారు. నగరానికి చెందిన భూపతిరాజు అన్మీష్‌ వర్మ ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుని, శిక్షణ కోసం 2018లో కడపలోని గండికోట స్పోర్ట్స్‌ అకాడమీలో చేరారు. డార్జిలింగ్‌ వెళ్లి ప్రాథమిక పర్వతారోహణ కోర్సు కూడా పూర్తిచేశారు. ఆపై కశ్మీర్‌లోని లడక్ ప్రాంతానికి వెళ్లి తీవ్రమైన చలి పరిస్థితులను తట్టుకునే మెలకువలను నేర్చుకున్నారు. ఇదే అంశంపై అక్కడే కోర్సును నేర్చుకున్నారు.

అన్నీ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి తన సామర్థ్యాన్ని తెలుసుకుని, 2018లో రాష్ట్రప్రభుత్వ యువజన సేవల విభాగం అధికారులు ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించేందుకు ఐదుగురిని ఎంపిక చేయగా.. వీరిలో ఒకరుగా అన్మీష్‌ నిలిచారు. అదే సంవత్సరం ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించడానికి వెళ్లారు. తీవ్రమైన చలిపరిస్థితులు తలెత్తి అన్మీష్‌ బృందంలోని ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆ బృందం మొత్తం వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులు తీవ్రంగా ఉన్నా కూడా.. తన కలల్ని సాకారం చేసుకోవడానికి అన్మీష్‌ ముందడుగు వేశారు. ఏప్రిల్‌ 19వ తేదీన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి పర్వతారోహణ ప్రారంభించారు.

వివిధ దేశాలకు చెందిన సుమారు 25 మంది బృందంతో కలిసి బయలుదేరిన అన్మీష్.. తీవ్రమైన చలి. మంచు గాలులకు ఎదరొడ్డి, తీవ్రతను తట్టుకోలేక కొందరు వెనక్కి వెళ్లిపోయినా.. ప్రాణాలు సైతం కోల్పోయినా.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాణాలను కాపాడుకుంటూ మరో నలుగురుతో కలిసి పరిస్థితులు అనుకూలించినప్పుడల్లా ముందుకు సాగుతూ ఎట్టకేలకు ఈ నెల ఒకటో తేదీన ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకున్నారు.

ప్రపంచ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌గా:
అన్మీష్‌ పది సంవత్సరాల వయస్సు నుంచే కరాటే నేర్చుకోవడం ప్రారంభించారు. అంచెలంచెలుగా నైపుణ్యం సాధిస్తూ బ్లాక్‌బెల్ట్‌ ‘థర్డ్‌ డాన్‌’ స్థాయికి చేరుకున్నారు. గ్రీస్‌లోని ఏథెన్స్‌ నగరంలో 2018లో జరిగిన ‘ప్రపంచ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ షిప్‌’ పోటీల్లో బంగారు పతకం పొంది ఆ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయుడుగా రికార్డు సృష్టించారు. 2019లో ఆస్ట్రియా దేశంలోని బ్రెగింజ్‌ నగరంలో జరిగిన ‘ప్రపంచ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ షిప్‌’ పోటీల్లోనూ పాల్గొని బంగారు పతకం గెలుచుకున్నరు. 2020 జనవరిలో ఆఫ్రికా ఖండంలోని అతిఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, ఫిబ్రవరిలో దక్షిణ అమెరికాలోని అకంకగోవా పర్వతాన్ని అధిరోహించారు అన్మీష్.