చాగంటి ప్రవచనాల స్పూర్తి..ప్రకృతి ఉత్పత్తులతో వివాహ వేడుకలు

కన్వెన్షన్ సెంటర్లు.. వీఐపీలు, సెలబ్రిటీల తాకిడి.. వెరసి కోట్ల రూపాయల ఖర్చు. ఈ రోజుల్లో పెళ్లంటే అంతా హడావుడి, ఆర్భాటమే. కానీ.. విశాఖ జిల్లాలో ఓ జంట గొప్పలకు పోకుండా ఏకమవ్వాలని నిర్ణయించింది. పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో.. పర్యావరణహితంగా ఒక్కటవ్వడానికి సిద్ధమవుతోంది. విశాఖలో జరిగిన ఓ పెళ్లి వేడుక పూర్తిగా ప్రకృతిలో లభించే వస్తువులతోనే జరిగింది. హిందూ సంప్రదాయంలో అచ్చమైన తెలుగు వివాహం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది.
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం ఎస్ రాయవరం గ్రామానికి చెందిన యువతికి, విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి వరుడుకి వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ రెండు కుటుంబాలకు దైవ భక్తి ఎక్కువ. పురాతన హిందూ సంప్రదాయ పద్ధతుల్లోనే పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. పర్యావరణానికి హాని లేకుండా పూర్తిగా ప్రకృతి ఉత్పత్తులతోనే వివాహ వేడుకను చేయడానికి నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ముందుగానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
టెంట్లు, షామియానాలు, సెట్టింగ్‌లు కాకుండా వెదురు కర్రలు, అరటి చెట్లు, తాటాకులు, కొబ్బరి ఆకులు, అరటి గెలలను ఉపయోగించి కల్యాణ వేదికను రూపొందించారు. సుమారుగా 80 అడుగుల పెండ్లి పందిరిని నిర్మించారు. పందిరిని పచ్చి పూలు, మొక్కజొన్న కండెలు, బెల్లం దిమ్మలతో, మామిడి కాయలు, రకరకాల పండ్లు, తామరపువ్వులు, కొబ్బరి మువ్వులు, మామిడాకులు, వరి కంకులతో అలంకరించారు. దీంతో పెళ్లి పందిరి సహజమైన కాంతులీనుతూ మిరుమిట్లు గొలుపుతోంది.
ఇక కళ్యాణ మండపాన్ని మట్టితో చేసి, పేడతో అలికి, పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేశారు. దాదాపు ఎకరం స్థలంలో కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. దాదాపుగా రెణ్నెల్ల నుంచి పూర్తిస్థాయి ప్రణాళికతో ఇరు కుటుంబీలు కలసి సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తే ఈ రూపు వచ్చిందని బంధువులు చెబుతున్నారు. ఈ వేడుకకు కనీసంగా నాలుగు వేల మంది అతిథిలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
వివాహా విందులో కూడా హిందూ సంప్రదాదాయలను ప్రతిబింబించేలా వంటకాలతో పాటుగా ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా పూర్తిగా ఆకులతోనే విందును కనువిందు చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి చాగంటి ప్రవచనాల స్ఫూర్తితో… వధూవరుల కుటుంబీకులు పర్యావరణ పరిరక్షణతో పాటుగా, పురానత హిందూ సంప్రదాయాల ప్రాముఖ్యతను చాటేలా వివాహా వేడుకను నిర్వహించడం అందరికీ ఆదర్శనీయం.
Read More : ఎలా ఉన్నారో..వింత ఫ్యామిలీ : నాలుగేళ్లు..నాలుగు గోడల మధ్యే